ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదంటూ చంద్రబాబును ఎద్దేవా
తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే తప్పేంటో చెప్పాలని, చంద్రబాబుకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు ఏరోజు ఒంటరిగా అధికారంలోకి రాలేదని, ఏదో ఒక పార్టీ పొత్తుల తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

రేపు అసెంబ్లీ , పార్లమెంట్ కు కూడా టీడీపీకి అభ్యర్థులు దొరకరు
చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న టిడిపి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఎన్నికలు మీకు అనుకూలంగా ఉంటాయని ఎన్నికలను బహిష్కరించలేదా అంటూ ప్రశ్నించారు. రేపు అసెంబ్లీ పార్లమెంటు కూడా అభ్యర్థులు దొరకరు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎద్దేవా చేశారు.

చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో పార్టీని కూడా రద్దు చేస్తారు
చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో పార్టీని కూడా రద్దు చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబును పిరికివాడు అన్నారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు అని అంబటి రాంబాబు చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లినా గెలిచే అవకాశం లేదని చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

తండ్రీ కొడుకులు కలిసి టిడిపి బండిని ముంచే పరిస్థితి
చంద్రబాబుకి రాద్దాంతం తప్ప సిద్ధాంతం లేదన్నారు. తండ్రీ కొడుకులు కలిసి టిడిపి బండిని ముంచే పరిస్థితి తీసుకు వచ్చారని విమర్శించారు. చంద్రబాబుకు, లోకేష్ కు టిడిపిని బతికించే సత్తా లేదని తేల్చి చెప్పారు. లోకేష్ కు పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ఆత్మ బంధువులు అంతా ఒకేలా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.