ఎస్సీలపై దాడులా?
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని లింగాపురం గ్రామంలో ఎస్సీలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వైయస్సార్సీపీ నాయకుల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. ఎస్సీలు రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారు.

వైసీపీ అలా చెప్పుకోవడం సిగ్గుచేటంటూ చంద్రబాబు
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని జగన్ గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లోనూ ప్రజా మద్దతు తమకే ఉందని వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటని చంద్రబాబు దయ్యబట్టారు.

మహిళల పట్ల అసభ్యంగానా?
గ్రామాలకు మీదకు గూండాలను వదిలి బడుగు బలహీన వర్గాలపై దాడులకు దిగడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడంతోపాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయమని ధ్వజమెత్తారు. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

వైసీపీ మద్దతుదారులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారు..
ఇది ఇలావుండగా, రాళ్ల దాడి చేసిన వారిపై కేసులుపెట్టకుండా, అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టారని లింగాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అమరావతి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ మద్దతుదారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. గాయపడిన కార్యకర్తలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోకపోగా, తమపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.