RBI Holds Repo Rate: వడ్డీ రేట్ల విషయంలో మార్కెట్‌ ఊహించిన నిర్ణయమే వచ్చింది. అందరి అంచనాలకు అనుగుణంగానే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును (Repo rate) 6.50% వద్ద కంటిన్యూ చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లను మార్చకుండా 6.50% వద్దే ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి.

శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఈ నెల 4-6 తేదీల్లో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (2023 October MPC Meeting), దేశీయ & అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించి కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకుంది.

వరుసగా నాలుగోసారి కీలక రేట్లపై ‘స్టేటస్‌ కో’ విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌, ‘వెయిట్ అండ్ వాచ్’ (wait and watch) మోడ్‌ను అవలంబించింది. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ (LAF) కింద, పాలసీ రెపో రేటును 6.50% నుంచి మార్చకూడదని మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 

మన దేశంలో డేంజర్‌ జోన్‌లోకి చేసిన CPI ఇన్‌ఫ్లేషన్‌ను (CPI inflation) నియంత్రించడానికి, 2022 మే నెల నుంచి 2023 ఫిబ్రవరి వరకు రెపో రేటును 2.50% లేదా 250 బేసిస్ పాయింట్ల మేర దూకుడుగా పెంచిన RBI, ఆ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్‌ 2023) నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్లు ఇవి
రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా నిర్ణయాల ప్రకారం… స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25% వద్దే ఉంది, మారలేదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు కూడా 6.75% వద్ద ఉన్నాయి. రివర్స్‌ రెపో రేటు 3.35% వద్ద కంటిన్యూ అయింది.

ఈ ఏడాది జులైలో, 7.4%గా నమోదైన సీపీఐ ద్రవ్యోల్బణం, ఆగస్టులో 6.8%కు దిగి వచ్చింది. అయినా, RBI టాలరెన్స్‌ అప్పర్‌ బ్యాండ్‌ కంటే ఇది పైనే ఉంది. 

దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తూనే, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ టాలరెన్స్‌ బ్యాండ్‌ పరిధిలోకి (4%-6%) క్రమంగా తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం ‘స్నేహపూర్వక వైఖరిని విడనాడే’ విధానాన్ని (withdrawal of accommodation stance) కొనసాగించాలని కూడా డెసిషన్‌ తీసుకున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (US FED), కీలక వడ్డీ రేట్ల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో జరిగే సమావేశంలోనూ వడ్డీ రేట్లను యూఎస్‌ ఫెడ్‌ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా అదే బాటలో నడవవచ్చు. అంతర్జాతీయంగా ఇలాంటి నెగెటివ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా, వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

సెప్టెంబరులో ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా వేశారు. కూరగాయల ధరలు, వంట గ్యాస్‌ రేటు తగ్గిన నేపథ్యంలో కొద్దికాలానికి ఇన్‌ఫ్లేషన్‌ తగ్గొచ్చని అన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి పరిమితం కావచ్చని వెల్లడించారు.

ఆర్థిక వృద్ధి రేటు అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు అంచనాలను 6.50%గా ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికంలో 6.50%; మూడో త్రైమాసికంలో 6.0%; నాలుగో త్రైమాసికంలో 5.70%, 2024-25 మొదటి త్రైమాసికంలో 6.60% గ్రోత్‌ రేట్‌ నమోదు కావచ్చని అంచనా కట్టింది.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో బలం
దేశంలో డిమాండ్‌ పుంజుకుంటోందని, ఎకానమీ పటిష్టంగా మారుతోందని దాస్‌ చెప్పారు. బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగుపడుతోందని, బ్యాంకింగ్‌ వ్యవస్థలోనూ బలం కనిపిస్తోందన్నారు. గత నెల (సెప్టెంబరు) 29 నాటికి మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex reserves) 586.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ప్రకటించారు.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యులు… డా. శశాంక భిడే, డా. అషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, డా. రాజీవ్ రంజన్, డా. మైఖేల్ దేబబ్రత పాత్ర, శక్తికాంత దాస్.

మరో ఆసక్తికర కథనం: వరల్డ్‌ కప్‌తో దేశంలోకి డబ్బుల వరద, వేల కోట్లు వస్తాయని అంచనా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *