ప్రస్తుతం చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్.. జాబిల్లి ఉపరితలానికి (Moon Surface) కేవలం 177 కిలోమీటర్ల దూరంలో ఉంది. మళ్లీ బుధవారం (ఆగస్టు 16న) నాలుగోసారి విన్యాసం నిర్వహించనున్నట్టు ఇస్రో పేర్కొంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు తదుపరి విన్యాసం చేపట్టనున్నట్టు తెలిపింది. ‘కక్ష్య సర్క్యులరైజేషన్ దశ ప్రారంభమవుతుంది. ఈరోజు చేపట్టిన విన్యాసంతో 150km x 177km వృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3 విజయవంతంగా చేరింది.. తదుపరి ఆపరేషన్ ఆగస్టు 16, 2023 ఉదయం 8.30 గంటలకు ప్లాన్ చేశాం’ అని ఇస్రో తెలిపింది.
వ్యోమనౌక కక్ష్యను తగ్గించే ప్రతి క్లిష్టమైన విన్యాసాన్ని ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ (IS4OM) విశ్లేషించి.. తదుపరి ప్రక్రియలో ఇతర లూనార్ ఆర్బిటర్‌లతో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేస్తుంది. ఆగస్టు 16న నిర్వహించే విన్యాసంతో చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చంద్రుడికి మరింత చేరువయ్యే క్రమంలో కక్ష్య నిర్ధారణ ప్రక్రియ అత్యంత కీలకం. ఈ విన్యాసాలు పూర్తయిన తర్వాత.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కేంద్రాన్ని ఎంపిక చేస్తారు.
ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడికి మరింత చేరవవుతుంది చంద్రయాన్-3. ఈ సమయంలో చంద్రుడికి చంద్రయాన్-3 దాదాపు 100 కి.మీ దూరంలో ఉంటుంది. ఆగష్టు 18న చివరిగా కక్ష్యను తగ్గించినప్పుడు.. చంద్రుడి ఉపరితలం, చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కి.మీల మాత్రమే ఉంటుంది.
Read More Latest Science & Technology News And Telugu News