ఏడు నెలల ప్రయాణం
గత ఏడాది ఆగస్టులో నాసా ప్రయోగించిన ఈ ఆస్ట్రోబయాలజీ పర్సెవెరెన్స్ రోవర్.. సుదూర తీరంలో ఉన్న అంగారక గ్రహాన్ని అందుకోవడానికి సుమారు ఏడునెలల పాటు ప్రయాణం సాగించింది. 472 మిలియన్ కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఆ సమయంలో దాని వేగం గంటకు 19 వేల కిలోమీటర్లు. అంగారక గ్రహం కక్ష్యలోనికి ప్రవేశించేంత వరకు అదే వేగంతో దూసుకెళ్లింది. మార్స్ కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే దాన్ని వేగాన్ని నాసా శాస్త్రవేత్తలు.. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి నియంత్రించారు. క్రాష్ ల్యాండింగ్ కాకుండా జాగ్రత్తలను తీసుకున్నారు.
దిగిన వెంటనే రేడియో సంకేతాలు..
అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల సమయంలో ఇది ల్యాండ్ అయింది. నాసా శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన జెజెరో క్రెటర్ (Jezero Crater) వద్ద ఇది దిగింది. ఈ ఆస్ట్రోబయాలజీ రోవర్ అంగారక గ్రహంపై దిగిన వెంటనే.. అక్కడి నుంచి సంకేతాలను పంపించింది. కొన్ని ఫొటోలను ట్రాన్స్ఫర్ చేసింది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌కు ఈ సంకేతాలు అందడంతో నాసా శాస్త్రవేత్తల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. నాసా ప్రయోగశాల చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ తరహా ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ప్రాజక్ట్ విజయవంతం కావడంపై జో బిడెన్ ప్రభుత్వం స్పందించింది. విజయవంతంగా మార్చడంలో శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయమంటూ అమెరికా ప్రభుత్వం వారిని అభినందించింది.
జెజెరో క్రెటర్..
ఈ ఆస్ట్రోబయాలజీ రోవర్రె అంగారక గ్రహంపై జెజెరో క్రెటర్ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా అంగారకుడిపై గుర్తించిన అత్యంత కఠిన ప్రదేశం ఇదే. రాళ్లు రప్పలు, ఎత్తుపల్లాలు, లోతైన లోయలతో నిండి ఉండే ప్రాంతం.. జెజెరో క్రెటర్. ఏ మాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో రోవర్‌ను ల్యాండ్ చేయించడం మరో ఎత్తుగా మారింది. దాన్ని నాసా విజయవంతం చేసింది. ఈ ప్రయోగంతో ఇప్పటిదాకా మార్స్‌పైకి అత్యధిక రోవర్లను ప్రయోగించిన దేశంగా అమెరికా మరో రికార్డును నెలకొల్పినట్టయింది.
వీక్షించిన జో బిడెన్..
ఆస్ట్రోబయాలజీ రోవర్ ల్యాండింగ్ ప్రక్రియను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వీక్షించారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ కార్యాలయం నుంచి ఆయన టీవీ ద్వారా దీన్ని తిలకించారు. ల్యాండింగ్ ప్రక్రియ మొత్తాన్నీ ఆయన ఆసక్తికరంగా చూశారు. విజయవంతంగా ల్యాండ్ అయిన వెంటనే.. ఆయన నాసా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి సంకేతాలు వెలువడిన విషయాన్ని వారు జో బిడెన్‌కు తెలియజేశారు. నాసా చరిత్రలో ఇదో శుభదినం అంటూ బిడెన్ వ్యాఖ్యానించారు.