అది 2019 సెప్టెంబరు 6 వ తేదీ. యావత్ దేశ ప్రజలందరూ తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణం. ఇస్రో పంపించిన చంద్రయాన్ 2 ప్రయోగం చంద్రుడిపై దిగాల్సిన సమయం. అప్పటివరకు అన్ని ప్రక్రియలు విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2 ప్రయోగం చివరి క్షణంలో ఇస్రో అధికారుల నుంచి కనెక్షన్ తెగిపోయింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు యావత్ భారతీయులందరూ అయోమయంలో పడిపోయారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయినట్లు అప్పటి ఇస్రో చీఫ్ కె. శివన్ ప్రకటించారు. దీంతో అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతోపాటు దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక శివన్ మాత్రం ఉండబట్టలేక కన్నీరు కార్చారు. ఆ సమయంలో చంద్రయాన్ 2 ల్యాండింగ్ చూసేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివన్‌ను కౌగిలించుకుని ఓదార్చారు. ఈ క్రమంలోనే శివన్‌తో పాటు అక్కడ ఉన్న శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ధైర్యంగా ఉండండి అని ప్రధాని నరేంద్ర మోదీ వారికి సూచించారు. చంద్రయాన్ 2 ప్రయోగం ల్యాండింగ్ చివరి క్షణంలో సాంకేతిక సమస్య వచ్చిందని ఇస్రో చీఫ్ చెప్పినప్పుడు శాస్త్రవేత్తలు మరింత నిరాశలో కూరుకుపోకుండా ఉండేందుకు మోదీ వారిలో ఆత్మ విశ్వాసాన్ని కల్పించారు. మరేం పర్లేదని 95 శాతం సక్సెస్ అయ్యారని.. గో అహెడ్ అని వారికి ప్రోత్సాహం అందించారు. ఒక్క ప్రధాని మోదీ మాత్రమే కాదు. ఆ సమయంలో యావత్ భారతీయులతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఇస్రోకు ధైర్యం చెప్పాయి. చంద్రుడి మీద కాలు మోపడం ఒక్కటి తప్ప చాలా వరకు సమాచారాన్ని ఫోటోలను కూడా చంద్రయాన్ 2 తో ఇస్రో సంపాదించింది. ఆ సమాచారమే ఇప్పుడు చంద్రయాన్ 3 విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అప్పటికే చంద్రయాన్ 1 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. చంద్రుడిపై నీటి జాడను కనుగొని ప్రపంచానికి చాటి చెప్పింది.

అయితే 2019 లో తలెత్తిన వైఫల్యంతో కుంగిపోకుండా ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసింది. మరో 4 ఏళ్లలోనే చంద్రయాన్ 3 పేరుతో చంద్రుడిపై దిగాలన్న లక్ష్యంతో మరో ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రయాన్ 2 లో సక్సెస్ ఆధారిత డిజైన్‌లో తయారు చేసిన ఇస్రో.. ఈసారి చంద్రయాన్ 3 లో ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్ రూపొందించి విజయాన్ని సాధించింది. దాదాపు రూ.620 కోట్ల బడ్జెట్‌తో అమెరికా, చైనా, రష్యాలకు సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపి అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌తో భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులను పంపడానికి ఉపయోగపడుతుందని ఇస్రో బలంగా విశ్వసిస్తోంది.

పోయిన చోటే వెతుక్కోవాలి.. ఓడిన చోటే గెలవాలి అనేది ఇస్రోకు బాగా తెలుసు. అందుకే చంద్రయాన్‌ 2 వైఫల్యాల నుంచే చంద్రయాన్ 3 విజయాన్ని రాబట్టింది. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ నుంచి భారీగా సమాచారాన్ని విశ్లేషించి.. వైఫల్యానికి ఆస్కారం ఉండే ప్రతి అంశాన్ని గుర్తించి.. విక్రమ్‌ ల్యాండర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఇంజిన్లను కంట్రోల్ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌లను జత చేశారు. తగినంత సమయం తీసుకోవడానికి అదనపు శక్తిని ఇచ్చేలా సోలార్‌ ప్యానళ్లను కూడా అమర్చారు.

చంద్రయాన్‌ 2 ల్యాండింగ్‌కు గుర్తించిన ప్రదేశం గతంలో 500 మీటర్ల పొడవు.. 500 మీటర్ల వెడల్పు ఉంది. తాజాగా చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌కు 4 కిలోమీటర్ల పొడవు 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేశారు. దీనిలో ఎక్కడైనా అది ల్యాండ్‌ అయ్యే అవకాశం కల్పించడంతో ల్యాండర్ దిగేందుకు మార్గం మరింత సులువైపోయింది. ల్యాండింగ్‌ సమయంలో ఏవైనా అడ్డంకులు ఉంటే.. ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించేందుకు పట్టే సమయం కోసం మరింత ఇంధనాన్ని కల్పించారు. ల్యాండింగ్‌ ప్రదేశాన్ని వేగంగా, కచ్చితంగా గుర్తించడం కోసం శక్తిమంతమైన కెమెరాను అమర్చారు. సెన్సర్‌, ఇంజిన్‌, అల్గారిథమ్స్‌లను ముందుగానే అంచనా వేసి వాటికి పరిష్కారాలను కూడా ముందే అమర్చారు.

చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్ అయిన ప్రాంతంలో ఉపరితలం ఎలా ఉందో సరి చూసుకున్న తర్వాతే రోవర్ బయటికి వచ్చేలా చేశారు. దీని కోసం కొన్ని గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ల్యాండర్‌ అన్ని సిస్టమ్స్‌ను పరిశీలించుకుంటుంది. ఆ తర్వాతే అది చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది.

Chandrayaan 3 Landed: విజయహో విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై దిగిన చంద్రయాన్ 3
Vikram lander: చంద్రుడిపై దిగిన తర్వాత ల్యాండర్‌, రోవర్‌లు ఏం చేస్తాయి.. తెలిపిన ఇస్రో
Read More Latest Science & Technology News And Telugu NewsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *