#NeelamSawhney Taken Charge as AP New SEC – తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా రికార్డు !!

పరిషత్ పోరును బాయ్‌కాట్ చేసిన టీడీపీ
మాజీ ఎస్ఈసీ హయాంలో గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్న కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయం కాకరేపుతోంది. ఈ నిర్ణయాన్ని ముందునుంచే వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఒక్కొక్కరుగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఎస్ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రధాన విపక్షం టీడీపీతో పాటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలు ఇవాళ ఎస్ఈసీతో జరిగిన భేటీని బహిష్కరించాయి. ఇప్పుడు ప్రధాన విపక్షం టీడీపీ మొత్తం ఎన్నికల ప్రక్రియనే బహిష్కరించాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్ధితుల్లో వైసీపీ సర్కారు, ఎస్ఈసీ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అందుకే బాధతోనే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

మంత్రులు లీక్ ఇచ్చాక నోటిఫికేషన్ ఇస్తారా ?
ఈ నెల 8వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, పదో తేదీన ఫలితాల ప్రకటన ఉంటుందని మంత్రులు ముందే లీక్ చేశారని, ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎస్ఈసీ నీలం సాహ్నీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయాన్ని ఎస్ఈసీ ఆమోదించడమే కాకుండా నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీల్ని సమావేశానికి పిలవడం దేనికి నిదర్శనమని చంద్రబాబు ప్రశ్నించారు. నిన్న అధికారులతో భేటీలో న్యాయసలహా తీసుకుంటామని చెప్పి రాత్రికి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలన్నారు.

నీలం సాహ్నీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు, లాలూచీ పడటం కాదు, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి విపక్ష నేత చంద్రబాబు సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు భారీగా పెరగడం దేనికి నిదర్శమని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అక్రమాలు ఎస్ఈసీకి కనిపించడం లేదా అని చంద్రబాబు నిలదీశారు. బలవంతపు ఉపసంహరణలు, ఏకగ్రీవాలు జరిగినా పట్టించుకోకుండా ఎస్ఈసీ పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో సీఎస్‌గా, సీఎం జగన్ సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నీ ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌గా ఉండటం వల్ల ఎన్నికల నిష్పాక్షికత ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. గతంలో హైకోర్టు జడ్డి పేరుతో జస్టిస్ కనగరాజ్‌ను నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు నీలంను ఏ అర్హతతో ఆ పదవిలో నియమించిందని చంద్రబాబు ప్రశ్నించారు.

హైకోర్టుతో పాటు ప్రజాకోర్టులోనూ పోరాటం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌పై న్యాయస్ధానాల్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై జాతీయ స్ధాయికీ తీసుకెళ్లి పోరాడతామని చంద్రబాబు తెలిపారు. గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి వారు కూడా ఎన్నికలను బహిష్కరించిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తన జీవితంలో ఇంత కఠిన నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదన్నారు. హైకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు వస్తుందని చంద్రబాబు తెలిపారు.