ఈ సిరీస్‌లో మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరలు రూ.3,000 వరకూ పెరిగాయి. ధరల పెంపు అనంతరం హీరో ఎక్స్‌పల్స్ 200 ధర రూ.1,18,230 లకు చేరుకోగా, ఎక్స్‌పల్స్ 200టి ధర రూ.1,15,800 లకు పెరిగింది. కాగా, హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ ధర రూ.1,20,214 లకు చేరుకుంది.

ఈ మోటార్‌సైకిళ్లలో ధరల పెరుగుదల మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. హీరో ఎక్స్‌పల్స్ రేంజ్ మోటార్‌సైకిళ్లలో 199.6 సిసి సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ఇంజెక్ట్ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 18.01 బిహెచ్పి పవర్‌ను మరియు 16.15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగానే మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. హీరో మోటోకార్ప్‌తో పాటుగా యమహా, బజాజ్ ఆటో వంటి ఇతర టూవీలర్ బ్రాండ్స్ కూడా ఏప్రిల్ నెలలో తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

హీరో ఎక్స్‌పల్స్ రేంజ్‌లోని బైక్‌లు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌తో మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటాయి. ఈ బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఇది సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

హీరో కరిజ్మా మోటార్‌సైకిల్‌ను నిలిపివేసిన తర్వాత, దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ సరికొత్త ఎక్స్సెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ బైక్‌లో 200 సిసి ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 17 బిహెచ్పి పవర్‌ను మరియు 16.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో మోటోకార్ప్ గడచిన మార్చి 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ కంపెనీ గత నెలలో 5.77 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది, గత ఏడాది మార్చిలో అమ్మిన 3.34 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం ఎక్కువ. బిఎస్ 6 అప్డేట్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా గత ఏడాది అమ్మకాలు ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది.

హీరో మోటోకార్ప్ మార్చిలో ఇప్పటివరకు అత్యధిక వాహనాలను ఎగుమతి చేసింది. హీరో మోటోకార్ప్ 2021 మార్చిలో మొత్తం 32,617 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 17,962 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు 82 శాతం పెరిగాయి.