కేంద్ర సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందనడానికి ఆధారంగా కేంద్ర సర్కారు పరిధిలోని ఢిల్లీ పోలీసులు పలువురు సామాజిక, పర్యావరణ ఉద్యమకారుల్ని అరెస్టు చేశారు. టూల్ కిట్ కుట్ర కేసుగా అభివర్ణిస్తోన్న ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అనూహ్య కామెంట్లు చేశారు.
రైతుల ఆందోళనలో భాగంగా వెలుగుచూసిన ‘టూల్‌కిట్’ వివాదంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. టూల్‌కిట్ సూత్రధారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో భారత్ ప్రపంచానికి అందిస్తోన్న సహకారాన్ని ప్రస్తావిస్తూ..విమర్శలు చేశారు. ‘భారత్ ప్రపంచానికి పీపీఈ కిట్లు తయారు చేసి సహకరిస్తుండగా.. వారు మాత్రం భారతీయులకు వ్యతిరేకంగా టూల్ కిట్లు తయారు చేస్తున్నారు. సిగ్గుచేటు’ అంటూ షెకావత్ ట్వీట్ చేశారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్‌కిట్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి దిశ రవిని అరెస్టు చేయగా, తాజాగా ఇద్దరిపై బెయిల్‌కు వీల్లేని వారెంట్లు జారీ అయ్యాయి. భారత ప్రతిష్ఠను మసకబార్చే లక్ష్యంగా టూల్‌కిట్‌ను రూపొందించారని పోలీసులు వెల్లడిస్తున్నారు. కాగా, ఈ అరెస్టులపై విపక్షాలు మండిపడుతున్నాయి. దిశ రవి అరెస్టును ప్రజాస్వామ్యంపై దాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుల నిరసనకు మద్దతుగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఈ టూల్‌కిట్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే.