ప్రసంగం ఆపేసిన ప్రధాని..
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బక్సా జిల్లాలోని తముల్పూర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గడిచిన ఐదేళ్లలో అస్సాంకు బీజేపీ ఏమేం చేసిందో చెబుతూ, మహా కూటమిగా జట్టు కట్టిన కాంగ్రెస్, దాని ముత్రులపై విమర్శలు సంధించారు. అయితే, జనమంతా శ్రద్ధగా ఆలకిస్తోన్నవేళ మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభలో పాల్గొన్న ఓ బీజేపీ కార్యకర్త ఎండదెబ్బకు కింద పడిపోవడాన్ని చూసి మోదీ మాటలు ఆపేసి, ఆదేశాలిచ్చారు..

పీఎంవో డాక్టర్ల పరుగు..
ప్రోటోకల్ ప్రకారం ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటన నిపుణులైన నలుగురు డాక్టర్ల బృందం కూడా విధిగా వెళుతుంది. అందులో ప్రధాని వ్యక్తిగత వైద్యుడు, పారామెడిక్, సర్జన్ ఇంకా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు. తముల్పూర్ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ కార్యకర్త వడదెబ్బ తగిలి కింద పడిపోవడాన్ని గమనించిన మోదీ.. ప్రసంగాన్ని ఆపేసి, పీఎంవో డాక్టర్లను పిలిచారు. ‘‘నాతోపాటు ఇక్కడికొచ్చిన పీఎంవో డాక్టర్లు వెంటనే ఇటు రండి.. బహుశా డీహైడ్రేషన్ తో బాధపడుతోన్న ఆ కార్యకర్తకు దయచేసి సాయం చేయండి” అని ప్రధాని సూచించడంతో డాక్టర్లు పరుగున వెళ్లి ఆ బీజేపీ కార్యకర్తను పరిశీలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆ కార్యకర్తను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా,

బీజేపీపై మతతత్వ ముద్రలా?
ఎన్నికల ప్రచార సభలో బీజేపీ కార్యకర్తకు పీఎంవో వైద్యుల చికిత్స అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అస్సాం ఒప్పందానికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని, గడిచిన ఐదేళ్లల్లో చేపట్టిన పనులే ఇందుకు నిదర్శనమని, కేంద్ర ప్రభుత్వం కూడా అస్సాంకు సహయకారిగా నిలిచిందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ సారధ్యంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలపైనా ఆయన విమర్శలు చేశారు. ‘‘సమాజంలో అందరి కోసం పనిచేసే బీజేపీపై మతతత్వ ముద్రలు వేస్తారు, అదే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మిగతా పార్టీలు సెక్యురల్ అని చెప్పుకోవడం విచిత్రం కాక మరేంటి? లౌకికవాదం, ఇటు కమ్యూనిజం రెండూ దేశానికి పెద్ద ప్రమాదమే. ఈసారి కూడా ఎన్డీఏనే గెలిపించాలని అస్సాం ప్రజలు డిసైడయ్యారు. అస్సాంలో శాంతి, సుస్థిర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఇక్కడి ప్రజలకు తెలుసు” అని మోదీ అన్నారు.