ఇందులో భాగంగానే, బజాజ్ ఆటో ఈ ఏడాది భారత మార్కెట్లో తమ సరికొత్త పల్సర్ ఎన్ఎస్250 మరియు పల్సర్ ఆర్ఎస్250 మోడళ్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇవి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

మార్కెట్లో బజాజ్ మోటార్‌సైకిల్ లైనప్‌లో పల్సర్ సిరీస్ అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం బజాజ్ పల్సర్ రేంజ్లో 125సీసీ నుండి 220సీసీ వరకూ మొత్తం 10 రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, బజాజ్ ఆటో ఇప్పటికే తమ కొత్త 250సీసీ పల్సర్ బైక్ ప్రోటో టైప్లను తయారు చేసి, రోడ్లపై పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న డొమినార్ 250 మోడళ్లను ఆధారంగా చేసుకొని కొత్త పల్సర్ 250 బైక్‌లను తయారు చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, డొమినార్ 250 బైక్‌లో ఉపయోగించిన అనేక భాగాలు, పరికరాలు కొత్త పల్సర్ 250 మోడళ్లలోనూ కనిపించే ఆస్కారం ఉంది. ఇలా చేయటం వలన బజాజ్ తమ కొత్త పల్సర్ 250 మోడళ్ల తక్కువ ధరకే అందించే అవకాశం ఉంది.

పల్సర్ లైనప్‌లో బజాజ్ ఆటో విక్రయిస్తున్న ఎన్ఎస్200 మరియు ఆర్ఎస్200 మోడళ్లపై ఈ కొత్త 250సీసీ పల్సర్ బైక్‌లను ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పల్సర్ ఎన్ఎస్ 200 ధర రూ.1.32 లక్షలుగా ఉంటే, ఆర్ఎస్ 200 ధర రూ.1.52 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.

బజాజ్ ఆటో నుండి కొత్తగా రానున్న పల్సర్ 250సీసీ మోడళ్లు, ప్రస్తుతం దాని అనుబంధ సంస్థ కెటిఎమ్ విక్రయిస్తున్న ఆర్సి200 మరియు డ్యూక్250 మోడళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

ఈ కొత్త పల్సర్ మోడళ్లలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, ఎల్ఈడీ ఇండికేటర్లతో పాటుగా లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉండొచ్చని అంచనా.

ఇంకా వీటిలో ఇరువైపులా డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్, స్లిప్ అసిస్ట్ క్లచ్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 248.8సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ప్రస్తుతం డొమినార్‌లో ఉపయోగించిన ఇదే ఇంజన్ 23.5 బిహెచ్పి పవర్‌ను మరియు 27 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొత్త పల్సర్‌లో ఈ గణాంకాలు స్వల్పంగా మారే అవకాశం ఉంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇదిలా ఉంటే ఇటీవల లీకైన సమాచారం ప్రకారం, పల్సర్ లైనప్‌లో బజాజ్ ఆటో కొత్తగా ఓ 180సీసీ వేరియంట్‌ను కూడా చేర్చేందుకు బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే బజాజ్ పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. – మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.