బెంగాల్‌పై మజ్లిస్ నజర్..
ఈ పరిణామాల మధ్య అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. పశ్చిమ బెంగాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే బిహార్ అసెంబ్లీలో అయిదు స్థానాలను సంపాదించుకున్న ఆ పార్టీ దృష్టి పశ్చిమ బెంగాల్‌పై పడింది. ముస్లిం ఓటుబ్యాంకు, మైనారిటీల జనాభా అధికంగా ఉండే నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టబోతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీ చేయబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంట్రీ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమౌతోంది.

గుజరాత్ ఊపును..
గుజరాత్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించిన మజ్లిస్.. అదే ఊపును బెంగాల్‌లనూ కనపర్చాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి మమతా బెనర్జీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా- ఈ ర్యాలీని రద్దు చేసినట్లు ఏఐఎంఐఎం పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకుడు జమీరుల్ హసన్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. గురువారం సాయంత్రం ఈ ర్యాలీని నిర్వహించాల్సి ఉంది. ఒవైసీ ఇందులో పాల్గొనాల్సి ఉంది.

అనుమతి ఇవ్వని పోలీసులు..
కోల్‌కతలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే మేతియాబుర్జ్ ప్రాంతంలో దీన్ని నిర్వహించ తలపెట్టారు. చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేసినప్పటికీ.. దీన్ని ఏర్పాటు చేయడానికి కోల్‌కత పోలీసులు అనుమతి ఇవ్వలేదని జమీరుల్ తెలిపారు. ఈ ప్రదర్శనను రద్దు చేశామని పేర్కొన్నారు. కోల్‌కతలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదివరకే ఇలాంటి ర్యాలీని నిర్వహించిన సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్నాయని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇస్తోన్నారు.

మమతా ఆరోపణలు..
కొద్దిరోజుల కిందటే మజ్లిస్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముస్లిం ఓటుబ్యాంకును చీల్చడానికి హైదరాబాద్‌కు చెందిన పార్టీ ప్రయత్నిస్తోందని, దీనికోసం బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ముడుపులను తీసుకుందని ఆరోపించారు. తమ పార్టీకి అండగా ఉంటూ వస్తో్న్న మైనారిటీ ఓటుబ్యాంకును అసదుద్దీన్ ఒవైసీ ద్వారా చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆమె ఇదివరకే విమర్శించారు. ఆమె చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో..తాజాగా ఎన్నికల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.