శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక బీజేపీ నేత ఇంటిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్ లోని నౌగాంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదుల దాడి నుంచి బీజేపీ నేత సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
నౌగాం ప్రాంతంలోని బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్ ఇంటి బయట గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు అక్కడ్నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్ తోపాటు పారిపోయినట్లు తెలిపారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సెంట్రీ.. ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నజీర్ చౌదరి తెలిపారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాశ్మీర్ బీజేపీ నేతలు చెప్పారు.
2018లోనూ అన్వర్ ఖాన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలోనూ అతడు తప్పించుకున్నాడు. అతనికి సెక్యూరిటీగా ఉన్న పోలీసుకు ఉగ్ర కాల్పుల్లో గాయాలయ్యాయి. కాగా, ఇటీవలి కాలంలో పలువురు బీజేపీ నేతలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.