జైపూర్ లో బిచ్చగాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే స్కిల్ సెంటర్ ప్రారంభించిన రాజస్థాన్ సర్కార్
రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లిహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్ఎస్ఎల్డిసి) మరియు సోపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంయుక్త ప్రయత్నాలతో బిచ్చగాళ్ళకు పునరావాసం కల్పిస్తున్నారు . ప్రస్తుతం, జైపూర్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశాతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది బిచ్చగాళ్లకు యోగా, క్రీడలు, కంప్యూటర్ తరగతులు నేర్పిస్తూ, వారికి ఆశ్రయం కూడా కల్పించారు.
వారిని సాధారణ పౌరులుగా జీవనం సాగించేలా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు .

బిచ్చగాళ్ళ కోసం కౌషల్ వర్ధన్ కేంద్రం .. బ్యాచ్ లు గా శిక్షణ
రాజస్థాన్ నైపుణ్య మరియు జీవనోపాధి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నీరజ్ కుమార్ పవన్ మాట్లాడుతూ, రాజస్థాన్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని యాచకులు లేని రాష్ట్రంగా మార్చాలని సంకల్పించారు. బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజస్థాన్ పోలీసుల సంయుక్త ప్రయత్నాలతో ఆర్ఎల్ఎస్డిసి ఒక సర్వే నిర్వహించింది . జైపూర్లో బిచ్చగాళ్ళ కోసం కౌషల్ వర్ధన్ కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ 20 మంది బ్యాచ్ గా బిచ్చగాళ్ళు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం వారికి ఉద్యోగాలు కల్పించబడతాయని కూడా స్పష్టం చేశారు.
జైపూర్ లో సక్సెస్ అయితే మిగతా జిల్లాలలో కూడా
జైపూర్ లో ఈ ప్రయత్నం సఫలమైతే, ఇతర జిల్లాల్లోనూ ప్రారంభిస్తామని ఈ ప్రయత్నం ద్వారా వారిని ఈ దేశంలోని మంచి పౌరులుగా మార్చాలని మేము భావిస్తున్నామని ఆయన తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం యాచకులను సాధారణ పౌరులుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.
వారికి శిక్షణ ఇచ్చే యోగా ట్రైనర్ మాట్లాడుతూ, సాధారణంగా ఉండే ప్రజలతో పోలిస్తే, యాచకులకు యోగా శిక్షణ ఇవ్వడం కాస్తంత కష్టమని వారు చెబుతున్నారు.

శిక్షణ తో పాటుగా వారికి వసతి కల్పించి, రోజుకు 215 రూపాయలు
ఎందుకంటే వారికి చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయని, మానసిక సమస్యలు కూడా ఉంటాయని, వాటన్నింటినీ అర్థం చేసుకొని వారికి యోగా నేర్పించే వారిని మార్చడం కాస్త ఇబ్బందికరమైన పనేనని వారంటున్నారు. అయితే వారి కోసం ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నామని శిక్షణ తో పాటుగా వారికి వసతి కల్పించి, రోజుకు 215 రూపాయలు కూడా చెల్లిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఈ డబ్బు శిక్షణ పూర్తయిన తర్వాత వారు ఏదైనా వ్యాపారం చేయదలచుకున్నా,ఆ పెట్టుబడికి పనికి వస్తుందంటూ చెప్పారు.

బిచ్చగాళ్లకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం కోసం రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
బిచ్చగాళ్లకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో భాగంగా వారికి ఆధార్ కార్డులను కూడా తయారుచేసి, వారికి బ్యాంకు ఖాతాను తెరవడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. బిచ్చగాళ్ళ సమగ్ర అభివృద్ధికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తే ఒక జైపూర్ లోనే కాదు, రాష్ట్రమంతా యాచకులు లేని రాష్ట్రంగా గొప్ప గా కనిపిస్తుంది.