National
oi-Madhu Kota
సరిహద్దు వెంబడి దాదాపు 10 నెలలపాటు కొనసాగిన ఉద్రిక్తతకు తెర దించుతూ భారత్, చైనాలు కీలక అడుగులు వేస్తున్నాయి. ఫేస్ టు ఫేస్ తలపడే పరిస్థితి ఉన్న కీలక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ అంగీకరించడం, తొలి దశ ఉపసంహరణ శుక్రవారం నాటికి పూర్తయిన నేపథ్యంలో మళ్లీ చర్చల ప్రక్రియ పున: ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది..
సరిహద్దు పరిస్థితులకు సంబంధించి భారత్-చైనాల మధ్య శనివారం(ఫిబ్రవరి 20న) 10వ రౌండ్ చర్చలు జరుగనున్నాయి. రెండు దేశాల మిలటరీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో వాస్తవాధీన రేఖ ఆవల చైనాలోని మోల్డో ప్రాంతంలో ఈ చర్యలు జరగనున్నాయి. మొదటి దశ బలగాల ఉపసంహరణ పూర్తయినందున, తదుపరి దశ ప్రక్రియను ఏ విధంగా నిర్వహించాలో, మొత్తంగా సరిహద్దు వెంబడి మళ్లీ గతేడాది ఏప్రిల్ నాటి సాధారణ పరిస్థితులు(స్టేటస్ కో) ఏర్పడే దిశగా సైనికాధికారులు చర్చలు జరుపనున్నారు.

చివరి సారిగా గత నెల 24వ తేదీన భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి. ఆ సందర్భంలోనే బలగాల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఆ క్రమంలోనే ప్యాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి ఇరు దేశాల సైన్యాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తయింది. రేపటి..
భారత్, చైనా మధ్య శనివారం జరగబోయే చర్చల్లో హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ ప్లెయిన్స్ వంటి ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై చర్చించనున్నాయి. అయితే హాట్ స్పింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో మొహరింపుల ఉపసంహరణపై ప్రధానంగా చర్చిస్తామని, కానీ 900 కిలోమీటర్ల పొడవున్న దేప్సంగ్ ప్లెయిన్స్లో కొంత సంక్లిష్టత ఉందని, అందువల్ల అక్కడ సైనిక ఉపసంహరణలకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.