International
-BBC Telugu

రష్యాలో ఒక ఆసుపత్రి లోపల డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో బయట మంటలు చెలరేగాయి.
వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి, ఆ పురాతన ఆసుపత్రి భవనం పైకప్పుకు అంటుకున్న మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
భవనంలో ఉన్న 120 మందికి పైగా జనాలను అక్కడనుంచి తరలించారు.
రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న బ్లాగోవేషెన్స్క్ ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.
అయితే, ఆస్పత్రి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతున్న హార్ట్ సర్జరీకి ఏ ఆటంకం రాకుండా అత్యవసర ఎలక్ట్రిసిటీ కేబుల్ సహాయపడింది.
మంటల నుంచి వస్తున్న పొగ ఆపరేషన్ థియేటర్లోకి చేరకుండా ఫ్యానులు అడ్డుకున్నాయి.
సర్జరీ నిర్విఘ్నంగా పూర్తయ్యింది. ఆపరేషన్ పూర్తయిన తరువాత ఆ రోగిని అక్కడ నుంచి తరలించారు.
“రోగిని కాపాడడమే మా టీమ్ లక్ష్యం. అందుకు శాయశక్తులా కృషి చేశాం” అని ప్రధాన సర్జన్ వాలెంటిన్ ఫిలటావ్ తెలిపారు.
రెండు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఎనిమిది మంది డాక్టర్లు, నర్సులు పాలుపంచుకున్నారు.
సర్జరీ ప్రారంభించిన కొద్ది సేపట్లోనే అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ఆస్పత్రి భవనం 1907లో జారిస్ట్ యుగంలో నిర్మించినదని, చెక్కతో కట్టిన భవనం పైకప్పు అంటుకోవడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయని రష్యా ఎమర్జెన్సీస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
ధైర్యంగా లోపల సర్జరీ నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని, సమయానికి అక్కడకు చేరి మంటలు ఆర్పడంలో సఫలమైన అగ్నిమాపక బృందాన్ని ఆమూర్ స్థానిక గవర్నర్ వాసిలీ ఆర్లోవ్ ప్రశంసించారు.
ఆ ప్రాంతంలో స్పెషలిస్ట్ కార్డియాలజికల్ యూనిట్ ఉన్న ఆస్పత్రి ఇదొక్కటే.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)