International
oi-Rajashekhar Garrepally
యాంగూన్: మయన్మార్లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, ప్రజల ద్వారా ఎన్నికైన అంగ్ సాన్ సూకీని విడుదల చేయాలంటూ భారీ ఎత్తున నిరసనలు చేస్తున్న ప్రజలపై సైనికులు, పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. అత్యంత కఠినంగా నిరసనలను అణచివేస్తున్నారు.
బుధవారం జరిపిన భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 38 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని యూనైటెడ్ నేషన్స్ ప్రత్యేక రాయబారి క్రిస్టిన్ ష్రానర్ బర్గెనర్ వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, సైనికులు వారిపై విరుచుకుపడుతున్నారు.

ఇప్పటి వరకు సుమారు 50 మందికిపైగా నిరసనకారులు పోలీసుల కాల్పుల్లో మరణించడం గమనార్హం. అంతర్జాతీయ ఒత్తిడులను లెక్క చేయకుండా మయన్మార్ సైన్యం ఆ దేశంలో సైనిక పాలనను కొనసాగిస్తోంది.
గత నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో సైన్యం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అనంతరం కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందగా, ఎక్కువ మంది చిన్నారులు గాయపడినట్లు తెలిపారు.
మయన్మార్లో పెద్ద నగరాలైన యాంగూన్, మాండలే సహా పలు ప్రాంతాల్లోని ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపిందని అక్కడి మీడియా తెలిపింది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ నేత అంగ్ సాన్ సూకీని సైనికులు నిర్బంధించి, మయన్మార్లో సైనిక పాలన విధించిన విషయం తెలిసిందే.