ఏపీలో ఎన్నికలకు గుర్తొచ్చే ప్రత్యేక హోదా
ఏపీలో 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన, 2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అయినా మెడలు వంచి తెస్తామంటూ వైసీపీ చేసిన ప్రకటనతో 2019లో వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీల్ని కట్టబెట్టారు ఏపీ ప్రజలు. అయితే బీజేపీకి మన అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్ధితి లేదు. అయినా అడుగుతూనే ఉంటామంటూ వైసీపీ రెండేళ్లుగా అదే పాట పాడుతోంది. అయినా బీజేపీని ఎదిరించి ప్రత్యేక హోదా అడిగే పరిస్ధితి వైసీపీకీ, టీడీపీకీ, ఇతర రాజకీయ పార్టీలకు కూడా లేదు.

ముగిసిన అధ్యాయమన్న బీజేపీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్ధిక సంఘం అడ్డుపడుతుందంటూ ఒకప్పుడు చెప్పిన కేంద్రం.. ఆ తర్వాత ఆర్ధిక సంఘంలో సభ్యులు కూడా మాకు సంబంధం లేని వ్యవహారం అంటూ కుండబద్దలు కొట్టేయడంతో మాటమార్చేశారు. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తూ నెట్టుకొస్తున్నారు. ఏపీలోనూ బీజేపీ ఇదే వాదన వినిపిస్తోంది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇక రాదన్న విషయం సగటు జనానికి ఎప్పుడో అర్ధమైపోయింది. ప్రత్యేక హోదా తెచ్చే సత్తా వైసీపీకీ కానీ విపక్ష టీడీపీకి కానీ లేదనే విషయం జనం గుర్తించారు.

పుదుచ్చేరిలో తేనెతుట్టె కదిపిన బీజేపీ
14వ ఆర్ధిక సంఘం సిపార్సుల మేరకు దేశంలో ఏ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ చెప్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హోదా ఇస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. దీంతో పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీపై పొరుగున ఉన్న ఏపీలో జనం మండిపడుతున్నారు. ఏపీలో ముగిసిన అధ్యాయమంటున్న ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా ఎన్నికల హామీ అవుతుందంటూ బీజేపీని నిలదీస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక కాషాయ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది.

ప్రత్యేక హోదా, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంత హోదా ఒకటి కాదా ?
ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక హోదా, ఇప్పుడు పుదుచ్చేరికి బీజేపీ ప్రకటించిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంత హోదా ఒకటైనా అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. గతంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హోదా ఉండేవి.
కానీ ఆర్టికల్ 35ఏ రద్దుతో జమ్మూ, కశ్మీర్, లడఖ్‌కు సైతం ప్రత్యేక హోదా పోయింది. ఇప్పుడు అక్కడ మిగిలి ఉంది ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంత హోదా మాత్రమే. ఇందులో భాగంగా సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధుల్ని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రస్తుతం ఉన్న 30-70 శాతం వాటాను 70-30 శాతానికి మార్చడం చేస్తున్నారు.
కానీ ప్రత్యేక హోదా పరిస్ధితి వేరు. ఇది కొండ ప్రాంతాలకు, అభివృద్ధి లేమి ఉన్న రాష్ట్రాలకు, అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలకు ఇచ్చేది. దీని ప్రకారం పన్ను రాయితీలతో పాటు భారీగా సాయం అందుతుంది. కానీ ఈ విషయాన్ని విడమర్చి చెప్పడంలో కూడా బీజేపీ వైఫల్యంతో ఏపీకి ప్ర్తత్యేక హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది.