లేఖలో సచిన్ వాజే సంచలనాలు…
‘2020లో నన్ను మళ్లీ పోలీస్ విధుల్లోకి తీసుకోవాలన్న నిర్ణయం పట్ల శరద్ పవార్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. నా నియమాకాన్ని పునరద్దరించకూడదని కోరుకున్నారు. అయితే పవార్ సాహెబ్‌కు నచ్చజెప్పి నన్ను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రూ.2కోట్లు డిమాండ్ చేశారు. అంత డబ్బు నేను చెల్లించలేనని చెప్పేశాను. అయినా ఫర్వాలేదు… తర్వాత చెల్లించు… అని హోంమంత్రి చెప్పారు.’ అని ఎన్ఐఏకి రాసిన లేఖలో సచిన్ వాజే పేర్కొన్నారు.

ఎంత వసూలు చేయమన్నారంటే…
అక్టోబర్,2020న అనిల్ దేశ్‌ముఖ్ తనను సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కి పిలిచి వసూళ్ల గురించి మాట్లాడినట్లు సచిన్ వాజే తెలిపారు. ముంబైలోని 1650 బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసివ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే అందుకు తాను నిరాకరించానని… అది తన పరిధిలో లేని అంశమని చెప్పానన్నారు. జనవరి,2021లో మరోసారి హోంమంత్రి అధికారిక నివాసానికి తనను పిలిపించినట్లు తెలిపారు. అప్పుడు కూడా అదే ప్రస్తావించారని… ముంబైలోని 1650 బార్ అండ్ రెస్టారెంట్లలో ఒక్కో బార్ నుంచి రూ.3.5లక్షల చొప్పున రూ.100కోట్లు వసూలు చేసివ్వాలని ఆదేశించినట్లు చెప్పారు.

వసూళ్ల దందాలో శివసేన నేత కూడా…
ఇదే లేఖలో శివసేన నేత అనిల్ పరబ్‌పై కూడా సచిన్ వాజే ఆరోపణలు చేశారు. జులై-అగస్టు 2020లో అనిల్ పరబ్ ఆయన అధికారిక నివాసానికి తనను పిలిపించినట్లు చెప్పారు. ఆ సమయంలో… సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్(SBUT) నుంచి రూ.50కోట్లు వసూలు చేసివ్వాలని అనిల్ పరబ్ తనను కోరినట్లు ఆరోపించారు. ట్రస్ట్‌పై కేసు ఉన్న నేపథ్యంలో… దాన్ని క్లోజ్ చేసేందుకు వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని చెప్పారన్నారు. అయితే అది తనవల్ల కాదని చెప్పానని అన్నారు.అంతేకాదు,జనవరి-2021న కూడా అనిల్ పరబ్ తనను పిలిపించారని… బీఎంసీలో 50మంది కాంట్రాక్టర్ల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.2కోట్లు వసూలు చేయాల్సిందిగా ఆదేశించారని ఆరోపించారు.

పరమ్ వీర్ సింగ్ ప్రస్తావన…
హోంమంత్రి అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడానికి అసలు కారణమైన పరమ్ వీర్ సింగ్ గురించి కూడా లేఖలో సచిన్ వాజే ప్రస్తావించారు. ‘హోంమంత్రి,అనిల్ పరబ్‌ల నుంచి వచ్చిన వసూళ్ల డిమాండ్లపై అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌తో నేను మాట్లాడాను. వారి డిమాండ్ల గురించి చెప్పాను. ఈ విషయంలో నేను భయాందోళనకు గురవుతున్నానని… భవిష్యత్తులో వివాదాల్లో చిక్కుకుంటానన్న భయం వెంటాడుతోందని చెప్పాను. సీపీ నా భుజం తట్టారు… అలాంటి అక్రమాల్లో ఇరుక్కోవద్దని,ఎవరు ఎవరి కోసం చెప్పినా వసూళ్ల జోలికి పోవద్దన్నారు…’ అని సచిన్ వాజే వెల్లడించారు.

ఎన్ఐఏ కస్టడీ పొడగింపు..
మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి ఆరోపణలపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ కారణంగానే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా సచిన్ వాజే ఎన్ఐఏకి లేఖ రాయడంతో అనిల్ దేశ్‌ముఖ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. వాజే లేఖపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న సచిన్ వాజేకి ఏప్రిల్ 9 వరకూ ముంబై కోర్టు కస్టడీని పొడగించింది.