Tuesday, August 3, 2021

మాంసాహారం: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

ఆంధ్రప్రదేశ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న జంతువుల్లో గాడిద కూడ చేరింది. ఆవు పాలు, గేదే పాలు, మేక పాల కంటే గాడిద పాలకు ఎక్కువ ధర పలుకుతోంది. చికెన్, మటన్‌తో పాటు గాడిద మాంసానికీ గిరాకీ ఎక్కువైపోయింది.

శారీరక దారుఢ్యానికి గాడిద పాలు, లైంగిక సామర్థ్యం కోసం దాని మాంసం తింటున్నామని ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలామంది చెబుతున్నారు.

అయితే, గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేగానీ, దాని మాంసం లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాడిద మాంసం, పాలకు డిమాండ్ చాలా పెరిగింది.

దీంతో గాడిదల అక్రమ రవాణా కూడా ఎక్కువైపోయిందని కాకినాడ కేంద్రంగా పనిచేసే యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ స్వచ్చంధ సంస్థ చెప్పింది.

గాడిద మాంసం తింటే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందని, దాని పాలు తాగితే జబ్బులు నయమవుతాయనే నమ్మకం ప్రజల్లో చాలా కాలంగా ఉందని. ఇటీవల అది మరింత పెరిగిందని ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు.

“గాడిద మాంసానికి గిరాకీ పెరగడంతో ఆ మాంసం అమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి. రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో గాడిదల సంఖ్య తక్కువ. దీంతో ఆ రాష్ట్రాల నుంచి వాటిని అక్రమంగా తరలిస్తున్నారు” అని యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి సురబత్తుల గోపాల్ ‘బీబీసీ’తో అన్నారు.

గాడిద మాంసం

ధర ఎంతంటే

“ప్రస్తుతం ఏపీలో ఒక్కో గాడిద ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతోంది. దీంతో మిగతా రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు” అన్నారు గోపాల్‌.

ఇప్పటికే దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య బాగా తగ్గిందని, ఏపీలో అది మరీ తక్కువగా ఉందని పరిస్థితి ఇలాగే కొనసాగితే వాటిని ముందు ముందు ‘జూ’లోనే చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాడిద మాంసం, పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గాడిద మాంసం తింటే లైంగిక పటుత్వం పెరుగుతుందనే నమ్మకమే దీనికి కారణమని గోపాల్‌ చెప్పారు.

గాడిద పాలు, మాంసంలో లైంగిక శక్తిని పెంచే లక్షణాలు లేవని నిపుణులు చెబుతున్నారు

గాడిద మాంసం తినదగినదేనా?.. ఆహార ప్రమాణాలు ఏం చెబుతున్నాయి

గాడిద పాలు, మాంసం విక్రయాలు ఒక్కొచోట ఒక్కో రకంగా జరుగుతున్నాయి. పాలు అమ్ముకునేవారు గాడిదలను ఇళ్ల దగ్గరకే తీసుకొచ్చి అమ్ముతుంటే, గాడిద మాంసం కోసం ప్రధాన కూడళ్లలో కూడా షాపులు ఏర్పాటవుతున్నాయి.

కొన్ని జిల్లాల్లో ఎప్పుడూ గాడిద మాంసం దొరుకుతుంటే, కొన్ని ప్రాంతాల్లో సీజన్ల వారీగా అమ్మకాలు జరుగుతున్నాయి.

“ఫుడ్‌ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌- 2011 ప్రకారం గాడిదను మాంసం కోసం పెంచే జంతువుగా పరిగణించరు. దాని మాంసం అమ్మడం నేరం. ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఐపీసీ 428, 429 సెక్షన్ల ప్రకారం శిక్ష కూడా పడుతుంది” అని గోపాల్‌ వెల్లడించారు.

ఏపీలో ప్రస్తుతం 5 వేల గాడిదల వరకు ఉన్నాయని, ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు చేపట్టకపోతే గాడిదలు కూడా అంతరిస్తున్న జంతువుల జాబితాలోకి చేరడం ఖాయమని గోపాల్‌ హెచ్చరించారు.

”ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ప్రకారం గాడిద పాలు, మాంసం మనిషి ఆహారంగా తీసుకునే జాబితాలో లేవు. వీటిలో ఎలాంటి పదార్థాలున్నాయి…? ఇవి తీసుకున్న తరువాత శరీరంలో ఏదైనా మార్పులు వస్తాయా…? అనేది శాస్త్రపరంగా నిర్ధరించకుండా తీసుకోవడం మంచింది కాదు. మనం ప్రతిరోజూ తీసుకునే చికెన్, మటన్ వంటివే వాతావరణ పరిస్థితులు మారినా, ఎక్కువ నిల్వ ఉంచినా ప్రాణాల మీదకు తెస్తాయి. అలాంటిది గాడిద మాంసాన్ని ఎటువంటి పరీక్షలు లేకుండా తినడం మంచింది కాదు. ఏ ఆహారమైనా తినదగినదా…? లేదా..? అని నిర్ణయించే పరీక్షలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (NIN), సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీకల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CFTRI) చేస్తాయి. ఈ సంస్థలు నిర్ధిరించకుండా తీసుకునే ఆహారం ఏదైనా కూడా విపరీత ఆరోగ్య పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంది” అని జీవీఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న అప్పారావు బీబీసీతో చెప్పారు.

ఏడేళ్లలో 5 వేల గాడిదలు మాయం

దేశంలో వీధి కుక్కలు, పందులు లాంటి పెంపుడు జంతువుల లెక్కలు కచ్చితంగా ఉండవు. సరైన లైసెన్సింగ్‌ విధానం లేకపోవడమే దీనికి కారణం.

పైగా జంతువులకు లైసెన్స్ తీసుకోవడం అనే చట్టం తీసుకురావాలా, వద్దా అనేది కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలి పెట్టింది.

దీంతో జంతువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన నిబంధనలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల కుక్కలకు, పందులకు లైసెన్స్‌ తీసుకోవాలంటూ జీవో నెంబర్ 693 జారీ చేసింది.

“20119లో జరిగిన పశుగణన లెక్కల ప్రకారం దేశంలో గాడిదల సంఖ్య 1.2 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వాటి సంఖ్య ప్రస్తుతం 5 వేలే ఉంది.

2012లో రాష్ట్రంలో వాటి సంఖ్య 10 వేలుగా ఉండేది. అంటే, ఏడేళ్లలో 50 శాతానికి పైగా గాడిదలు తగ్గిపోయాయి. దేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. 2012 నుంచి దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్యలో 61.23 శాతం తగ్గుదల కనిపించింది” అని పశు సంవర్థక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్ గోపాలకృష్ణ బీబీసీకి చెప్పారు.

గాడిద మాంసం, వాటి పాల విషయంలో శాస్త్రీయ ఆధారాలు లేకుండా రకరకాల నమ్మకాలతో వినియోగిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

“లైంగిక సామర్థ్యం పెంచుతుందనే నమ్మకంతో గాడిద మాంసం తింటే, అది లేనిపోని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వ్యాపారం చేసుకోడానికి కొందరు అలాంటి వాటిని ప్రచారం చేశారు” అని పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జి. నెహ్రూ బాబు చెప్పారు.

పాలు, మాంసంకంటే అక్రమరవాణా ఆదాయమే ఎక్కువ

ఆంధ్రప్రదేశ్‌లో గాడిదల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో, ఇతర రాష్ట్రాల నుంచి గాడిదలను అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి మాంసం విక్రయిస్తున్నారు. గతంలో ముంబయి నుంచి ఏపీకి తరలిస్తున్న 8 గాడిదలను, రెండు రోజుల క్రితం దాచేపల్లిలో 39 గాడిదలను పోలీసులు పట్టుకున్నారు.

అయితే ఈ కేసులతో పోలిస్తే అక్రమంగా రవాణా అవుతున్న గాడిదల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువేనని జంతు ప్రేమికులు అంటున్నారు.

ఒక టీ గ్లాసు(100 నుంచి 150 మిల్లీ లీటర్లు) గాడిద పాలు ప్రాంతాన్ని బట్టి రూ.50 నుంచి రూ.100 వరకూ అమ్ముతున్నారు. వాటి మాంసం కూడా కేజీ రూ.500 నుంచి రూ.700 పలుకుతోంది.

కొంతమంది గాడిద పాలు, మాంసంకంటే వాటి అక్రమ రవాణా ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గాడిదను 3 వేలు నుంచి 5 వేల మధ్య కొనుగోలు చేసి, మరో రాష్ట్రంలో దానినే రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు అమ్ముతున్నారు” అని యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ సభ్యుడు కిశోర్‌ బీబీసీకి చెప్పారు.

గాడిద పాలు, మాంసంలో లైంగిక శక్తిని పెంచే లక్షణాలు లేవని నిపుణులు చెబుతున్నారు

ప్రధాన జంక్షన్లలో మాంసం, పాల డోర్ డెలివరీ

ప్రకాశం, గుంటూరు, విజయవాడలో గాడిద పాల డోర్‌ డెలివరీ కూడా ఎక్కువగా కనిపిస్తోంది.

గాడిద మాంసం దుకాణలైతే ప్రధాన కూడళ్లలో బహిరంగంగానే కనిపిస్తుంటాయి. దానిని అమ్మేవారు ఎలాంటి సంకోచం లేకుండా వ్యాపారం సాగిస్తుంటారు.

“పాలను తీసుకొచ్చి ఇవి గాడిద పాలు అంటే ఎవరూ నమ్మరు. అందుకే నేరుగా గాడిదలను ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చి, వాళ్ల ముందే పాలు పితికి అమ్ముతాం. గాడిద పాల వ్యాపారం కోసమే రాజస్తాన్ నుంచి 40 కుటుంబాల వాళ్లం ఇక్కడికి వచ్చాం. గాడిద పాలు చాలా జబ్బులను నయం చేస్తుంది. 20 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాం” అని ఇంటింటికి తిరిగి గాడిద పాలు అమ్మే నాంచార్ చెప్పారు.

“నాకు పాతికేళ్లుగా ఊపిరితిత్తుల సమస్య ఉంది. గాడిద పాలు తాగడం మొదలుపెట్టాక అది తగ్గింది. మా పిల్లలకు కూడా గాడిద పాలు తాగిస్తున్నాం. బాగా పని చేస్తాయి. ఆ మాంసం కూడా తింటాను. ఎలాంటి ఇబ్బందీ రాలేదు” అని విజయవాడకు చెందిన దేవమ్మ చెప్పారు.

“ఒక గ్లాసు పాలు 100 రూపాయలకు అమ్ముతారు. మా ఇంట్లో పిల్లలు, పెద్దలు అంతా ఈ పాలు తాగుతాం. కీళ్లనొప్పులు, ఉబ్బసానికి గాడిద పాలు బాగా పని చేశాయి. మాంసం మాత్రం తినలేదు. కానీ మా ఊళ్లో కూడా అది అమ్ముతారు” అని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన నారాయణ బీబీసీతో అన్నారు.

గాడిదల దొంగతనం

తెలుగు రాష్ట్రాల్లో గతంలో గాడిదలను ప్రధానంగా రవాణాకు, బరువులు మోయడానికి ఉపయోగించేవారు. వాగులు, నదుల నుంచి ఇసుక మూటలు తేవడానికి, దుస్తులు ఉతికేవారు ఆ మూటలు తేవడానికి వాడేవారు.

తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు వంటి జిల్లాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉండేది.

విజయనగరం జిల్లా సాలూరులో గాడిదలను దొంగిలించిన కేసులు నమోదైన సందర్భాలున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

వీటి మాంసానికి గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించడం కోసం అక్కడ గాడిదలను చోరీ చేసేవారు.

డాక్టర్ కూటికుప్పల సూర్యారావు

అందం కోసం గాడిద పాలతో స్నానం

గాడిద మాంసం లైంగిక పటుత్వాన్ని పెంచుతుందని శాస్త్రీయ నిరూపణలు లేనప్పటికీ, వాటి పాలలో విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు లాంటివి ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.

“గాడిద పాలలో ఉండే ప్రొటీన్‌ను కింగ్‌ ప్రొటీన్‌ అంటారు. ఆవు, గేదె పాలు పడని పసిపిల్లలకు గాడిద పాలు తాగిస్తారు. పూర్వం రాణులు తమ అందాన్ని కాపాడుకోవడానికి గాడిద పాలతో స్నానం చేసేవారని చరిత్రలో ఉంది. కానీ దాని మాంసం తింటే లైంగిక పటుత్వం వస్తుందని ఎక్కడా ఆధారాలు లేవు. అసలు, గాడిద మాంసానికి అలాంటి లక్షణాలు లేవు” అని ప్రముఖ వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యారావు బీబీసీతో అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

Fleet your last Fleet — The Twitter feature vanishes today – TechCrunch

You don’t know what you’ve got ’til it’s gone. After a fittingly fleeting time in the wild, Twitter is banishing its ephemeral stories feature...

Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for ~$48M (Laurel Deppen/GeekWire)

Laurel Deppen / GeekWire: Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for...

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe