Tuesday, May 24, 2022

మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా? ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటే

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

Click here to see the BBC interactive

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు మాట్లాడేవారు 8.11 కోట్ల మంది ఉన్నారు.

అయితే, తెలుగు భాషకు ప్రాచీన హోదా విషయంలో సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రాచీన భాషగా ప్రకటించినా, దానికి అనుగుణంగా అధ్యయన ప్రయత్నాలకు మరో దశాబ్దకాలం పట్టింది.

మూడేళ్ళ క్రితం కర్ణాటకలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. దానిని తెలుగు నేలకు తరలించి ఏడాది దాటింది.

ఈ నేపథ్యంలో ప్రాచీన హోదా వల్ల తెలుగు భాషకు ఏ మేరకు ప్రయోజనం కలిగిందనేది పరిశీలించాల్సి ఉంది.

దేశంలో ఆరు భాషలకు ప్రాచీన హోదా

ప్రస్తుతం దేశంలో తెలుగుతో కలిపి ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది. వీటిలో సంస్కృతం, తమిళం, మలయాళం, ఒడియా, కన్నడం ఉన్నాయి.

కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో, ఆయా భాషల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ చరిత్రను పరిశోధించి, పరిరక్షించేందుకు ఈ హోదా ఉపయోగపడుతుంది.

దానికి తగ్గట్టుగా జాతీయ భాషా సంస్థ పర్యవేక్షణలో అధ్యయన కేంద్రాలు ఏర్పాటవుతాయి.

ప్రస్తుతం అన్ని భాషలకు అధ్యయన కేంద్రాలు ఉండగా, సంస్కృతం, తమిళ భాషలను మాత్రం అటానమస్ చేశారు. దాంతో, ఈ రెండు భాషలకు అధిక నిధులు కేటాయించే అవకాశం ఏర్పడింది.

బీబీసీ భారతీయ భాషలు

తెలుగు భాషకు ఎన్ని నిధులు ఇచ్చారు..

తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలంటూ సుదీర్ఘకాలంపాటు వివిధ తెలుగు సంఘాల నుంచి డిమాండ్ వినిపించింది.

చివరకు 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం కన్నడంతోపాటూ తెలుగుకి ప్రాచీన హోదా ప్రకటించింది. ఫలితంగా గత మూడేళ్లలో తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం రూ. 3 కోట్లు కేటాయించిందని ఇటీవల రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారు.

అదే సమయంలో సంస్కృతం, తమిళ భాషలకు కేంద్రం ఏటా రూ. 6 కోట్లకు పైగా అందించింది. దాంతో ఆయా భాషల్లో పరిశోధనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది.

తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం

తెలుగు భాషకు ఎక్కువ నిధులు రావాలంటే

సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు భాష సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అధ్యయనానికి మరిన్ని నిధులు అవసరమని భాషాభిమానులు కోరుతున్నారు.

అయితే, దానికి సంబంధించిన ప్రక్రియ కొంత పూర్తి చేయాల్సి ఉందని నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు బీబీసీకి చెప్పారు.

“తెలుగుభాషకు ఉన్న చారిత్రక సంపదను వెలికితీయడానికి చాలా కృషి జరగాలి. దానికి అనుగుణంగా అధ్యయన కేంద్రానికి నిధులు రావాలి. స్వయం ప్రతిపత్తి వస్తే ఫలితం ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో సొంత భవనం నిర్మించవచ్చు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాము. అవన్నీ కార్యరూపం దాలిస్తే త్వరలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతాయి. ప్రస్తుతం మైసూర్‌లో ఉన్న ముద్రణ విభాగం సహా పలు రంగాలు సిద్ధం అవుతాయి” అన్నారు.

మైసూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం

ఆలస్యానికి ఎన్నో కారణాలు…

తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కినా, దశాబ్ద కాలం పాటు ఫలితం లేకుండా పోయింది.

తొలుత కేంద్రంలో కదలిక లేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిని ఎటూ తేల్చకుండా కొంతకాలం గడిచిపోయింది. చివరకు మైసూర్ కేంద్రంగా దానిని ఏర్పాటు చేసేందుకు భారతీయ భాషా సంస్థ నిర్ణయం తీసుకుంది.

2018 డిసెంబర్‌లో మైసూరులో కన్నడ భాషతో కలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటయ్యింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం, ఆ కేంద్రాన్ని 2019 చివరిలో నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతానికి తరలించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ భవనంలో 2020 జనవరిలో దానికి ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. ఈ జాప్యం వల్ల ప్రాచీన తెలుగు హోదా ఫలితాలు అందకుండాపోయాయి.

తెలుగు

కృషి మొదలైంది, ఫలితాలు వస్తాయి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని, తెలుగు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడంతో ఏడాదిగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

గత ఏడాది ఏడుగురు పరిశోధకులు ఇక్కడ అధ్యయనం పూర్తి చేశారు. ఆ ఏడుగురి నివేదికలు ఆమోదం పొంది ముద్రణకు సిద్ధమయ్యాయి.

ఈ ఏడాది 15మంది అధ్యయనం ప్రారంభించారు. బయటి నుంచి వచ్చినవారు కూడా పరిశోధన చేస్తున్నారని చెబుతున్నారు.

అయితే, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరిగితే మరింత ప్రయోజనం ఉంటుందని సీనియర్ ఫెలో టి. సతీశ్ అంటున్నారు.

“తెలుగు కావ్యసూచి సిద్ధం చేశాం. ఎన్నో పరిశోధనలు చేశాం. తంజావూరు, మద్రాస్, రాజమండ్రి సహా అన్ని ప్రాంతాల్లో తిరిగి పలు ఆధారాలు సేకరించాము. శతకాలు, వచన, పద్య కావ్యాలు ఇలా ఒక్కో విభాగానికి సంబంధించిన వాటిని పరిశీలించేందుకు అనుగుణంగా సిద్ధం చేశాము. 1850కి ముందు అప్పటి 2 వేల మంది కవులు, రచయితల సమగ్ర వివరాలు నేటితరానికి అందించే అవకాశం ఉంది. ప్రాచీన కవుల చరిత్రను సంక్షిప్త చరిత్రను డిజిటలైజ్ చేసేందుకు సహకారం అవసరం. నిధులు కూడా ఉంటే మరింత మెరుగ్గా ఉంటుంది” అన్నారు.

ఆంధ్రమహాభారతం-గిరిజన సామాజిక జీవనంపై సతీశ్‌, ఎన్ రాంబాబు, మల్లు పురాణం-గ్రంథ పరిష్కరణ అంశంపై కె.రమేశ్, గోదావరిజిల్లాలు – సాహిత్య, సామాజిక, సాంస్కృతిక అధ్యయనంపై ఎం.సత్యనారాయణ, తెలుగు ప్రబంధాలు-గ్రంథ పరిష్కరణ పద్ధతులుపై టిఎస్.వెంకటేష్, ఎర్రన్న అరణ్య పర్వసేశం- కారక వైచిత్రిపై ఎం.కాశింబాబు, ప్రాచీన కన్నడ, తెలుగు కవయిత్రులు -తులనాత్మక పరిశీలనపై బి నాగశేషు సిద్ధం చేసిన పరిశోధన గ్రంథాలను త్వరలో ముద్రించడానికి అధ్యయన కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

వాటితోపాటూ ఈ కేంద్రం ద్వారా తెలుగు భాషా నిపుణులతో వర్క్ షాప్‌లు, పలు గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువదించడం, లిపికి సంబంధించి ఉభయ రాష్ట్రాల పరిధిలో 6 శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం

విస్తరణ అవసరం.. ముద్రణ జరగాలి

తెలుగు చరిత్రలో తాళపత్ర, తామ్రపత్ర గ్రంథాలు సహా అన్నింటినీ పరిశోధించేందుకు ఈ కేంద్రాన్ని విస్తరించాలని భాషాభిమానులు చెబుతున్నారు.

“ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని విస్తరించాలి. దానికి తగ్గట్టుగా శాశ్వత సిబ్బంది రావాలి.

అవసరం మేరకు నిధులు ఇవ్వాలి. నేతలు దానికి చొరవ చూపాలి. వాటిని ముద్రించి భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలి” అని నెల్లూరు కవి, రచయిత ఈతకోట సుబ్బారావు అన్నారు.

తెలుగుకు ప్రాచీన హోదా కోసం చేసిన కృషి ఫలితాలు దక్కాలంటే ఇప్పుడీ అధ్యయన కేంద్రం అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని తెలుగు భాషాప్రియులు ఆశిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత అధ్యయన కేంద్రం తీరు మెరుగుపరచాలని కూడా కోరుతున్నారు.

“తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కి 13 ఏళ్ళు గడుస్తోంది. అధ్యయన కేంద్రం స్థాపించిన మూడేళ్ళలో ఇప్పటివరకూ ఒక్క గ్రంథాన్ని కూడా ముద్రించలేదు. డిజిటలైజ్ కూడా చేయలేదు. దీనిని సరిదిద్దాలి” అని తిరుపతికి చెందిన కవి ఎం. శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe