India Post Accident Policy: దానధర్మాలు, స్వచ్ఛంద సమాజ సేవ చేసే మంచి మనుషులు మనలో చాలా మంది ఉన్నారు. అన్నదానం చేయడం, విద్యార్థులను దత్తత తీసుకోవడం, మూగజీవాలకు ఆహారం అందించడం, విరాళాలు ఇవ్వడం వంటి డబ్బుతో కూడుకున్న పనులను కొందరు ఎంచుకుంటారు. డబ్బు ఖర్చు చేసే స్థోమత లేని వాళ్లు… పేద విద్యార్థులకు చదువు చెప్పడం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గోవడం, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడం వంటి బాటను ఎంచుకుంటారు. తోటివారికి సాయం చేయాలన్న మనస్సు ఉంటే, ఏ మార్గమైనా సన్మార్గమే.

ఈసారి, ఇలాంటి సేవలకు భిన్నంగా ఆలోచిద్దాం. ఒక పేద కుటుంబం మొత్తానికి ఆర్థిక రక్షణను అందించే బీమా పాలసీని కొనిద్దాం. ఇది కూడా దీనజనుల సేవ కిందకే వస్తుంది. దీని కోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు ఒకే ఒక్క రూపాయిని వెచ్చిస్తే చాలు. ఒక కుటుంబం మొత్తానికి ఆర్థిక భద్రతను కల్పించినవాళ్లు అవుతారు. అంతేకాదు, ఇద్దరు పిల్లల చదువుల కోసం సాయం చేసిన విద్యాదాతగానూ నిలుస్తారు. ఇందుకోసం, భారతీయ తపాలా విభాగం మీకు అవకాశం కల్పిస్తోంది. 

అన్ని బీమా సంస్థలతో పాటు భారతీయ తపాలా విభాగం (postal department) కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని నిర్వహిస్తోంది. గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ (GAG) పేరిట ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పాలసీ కోసం ఏడాదికి కేవలం 399 రూపాయలు చెల్లిస్తే చాలు. వాళ్లకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కవరేజ్‌ లభిస్తుంది. అంటే, రోజుకు ఒక్క రూపాయి కంటే కాస్త ఎక్కువ ఖర్చుతో, ఒక భారీ ప్రమాద బీమా కవరేజీ పొందవచ్చు. ఈ డబ్బు కూడా కట్టలేని అత్యంత నిరుపేదలు మన చుట్టూ ఉన్నారు. అలాంటి వాళ్ల పేరిట మీరు ఒక పాలసీని కొనుగోలు చేస్తే, ఆ కుటుంబం మొత్తానికి భరోసా లభిస్తుంది. ఇది కూడా దాతృత్వమే.

పోస్టాఫీస్‌ ప్రమాద బీమా వివరాలు
18 నుంచి 65 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ‍‌‍(India Post Payments Bank) ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే, ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. పాలసీదారు రోడ్డు ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. 

పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే, IPD (ఇన్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) కింద 60 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్‌ పేషెంట్‌ (OPD) విషయంలో.. 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు. 

ఇతర అదనపు ప్రయోజనాలు
ఈ పాలసీలో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద, గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ట్యూషన్‌ ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకునే ఆప్షన్‌ ఉంది. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.

₹299కి కూడా ₹10 లక్షల ప్రమాద బీమా
ఇదే పథకాన్ని 299 రూపాయల ప్రీమియం ఆప్షన్‌తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే, ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్‌లో కవర్‌ అవుతాయి. ఇతర అదనపు ప్రయోజనాలు మాత్రం అందవు.

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Adani Group, ICICI Lombard, Emami

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *