PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మీ ఇంటి వంట మరింత చౌక – భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు


Edible Oil Prices: అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు త్వరలో కాస్త ఊరట లభించనుంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, ఎడిబుల్‌ ఆయిల్‌ కంపెనీలు వంట నూనెల ధరలు తగ్గిస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన కమొడిటీ ధరలు ఇటీవలి నెలల్లో గణనీయంగా తగ్గాయి. వెజ్ ఆయిల్ ధరలు కూడా బాగా దిగి వచ్చాయి. వంట నూనెలు దిగుమతి చేసుకునే కంపెనీలే గాక, వినియోగదార్లు కూడా ఈ తగ్గుదల ప్రయోజనం పొందాలని భారత ప్రభుత్వం భావించింది. వంట నూనెల ప్యాకేజింగ్‌పై గరిష్ట చిల్లర ధరలను (MRP) తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిదార్లను కోరింది. దీనికి కొన్ని కంపెనీలు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయి. మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తాయని, వంట నూనెల రేట్లు 6 శాతం వరకు తగ్గవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

తగ్గనున్న ఫార్చ్యూన్‌, జెమిని వంట నూనెల రేట్లు
‘ఫార్చ్యూన్’ (Fortune) బ్రాండ్‌తో  వంట నూనెలు విక్రయిస్తున్న “అదానీ విల్మార్” లీటరుకు 5 రూపాయలు, ‘జెమిని’ (Gemini) బ్రాండ్‌తో నూనెలు అమ్ముతున్న “జెమిని ఎడిబుల్‌ అండ్‌ ఫ్యాట్స్ ఇండియా” లీటరుకు 10 రూపాయల చొప్పున ధరలు తగ్గించాలని నిర్ణయించాయి. ధర తగ్గింపు ప్రయోజనం దాదాపు మూడు వారాల్లో వినియోగదార్లకు చేరుతుందని ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.

“వంట నూనెల గరిష్ట చిల్లర ధర తగ్గించాలని, వినియోగదార్లకు ప్రయోజనం అందించాలని కేంద్ర ఆహార & వినియోగదార్ల వ్యవహారాల శాఖ SEAకు సూచించింది. SEA సభ్య కంపెనీలకు ఈ విషయాన్ని చేరవేయాలని చెప్పింది” – సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (SEA) 

భారీగా తగ్గిన అంతర్జాతీయ ధరలు
గత ఆరు నెలల్లో, ముఖ్యంగా గత 60 రోజుల్లో అంతర్జాతీయ ధరలు భారీగా తగ్గాయి. వేరుశెనగ, సోయాబీన్, ఆవాలు బంపర్‌గా ఉత్పత్తి అయ్యాయి, అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు తగ్గాయి. తగ్గిన రేట్ల వద్ద వాటిని దిగుమతి చేసుకుంటున్న కంపెనీలు, మన దేశంలో మాత్రం ధరలు తగ్గించలేదు. 

దిగుమతి చేసుకుంటున్న సోయాబీన్ నూనె ధర గత రెండు నెలల్లో 14.5% తగ్గింది, పొద్దు తిరుగుడు, రాప్‌సీడ్ నూనెల ధరలు వరుసగా 10.5%, 11% తగ్గాయి. అంతర్జాతీయంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు పామాయిల్ కంటే చౌకగా మారాయి.

పొద్దుతిరుగుడు నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటి.

వంటనూనెల తయారీకి ఉపయోగించే వేరుశనగ, సోయాబీన్‌, ఆవాలు, పత్తి వంటి దాదాపు అన్ని నూనె గింజల ధరలు గత నెలలో 3-7% వరకు తగ్గాయి. వంట నూనెలను చవగ్గా దిగుమతి చేసుకుంటున్న కారణంగా, భారతదేశంలో ముఖ్యమైన నూనె గింజల పంట అయిన ఆవాల దేశీయ ధర ప్రభుత్వ కనీస మద్దతు ధర (MSP) స్థాయి కంటే తక్కువగా ఉంది.

రేటు తగ్గించిన మదర్ డెయిరీ
ధార (Dhara) బ్రాండ్‌తో వంట నూనెలు విక్రయిస్తున్న మదర్ డెయిరీ కూడా ధర తగ్గింపుపై ఒక ప్రకటన విడుదల చేసింది. నూనె రకాన్ని బట్టి లీటరుకు 15 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది. సవరించిన MRP స్టాక్స్‌ వచ్చే వారం నాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం తగ్గడం, దేశీయ దిగుబడులు పెరగడం వల్ల సోయాబీన్ ఆయిల్, రైస్‌బ్రాన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె రకాల్లో ఎక్కువ తగ్గింపు ఇస్తున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *