మేయర్ ఏమన్నారు…
మంగళవారం(ఫిబ్రవరి 16) ముంబైలో మీడియాతో మాట్లాడిన మేయర్ పడ్నేకర్.. కరోనా నిబంధనలను ప్రజలకు గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటి విషయాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముంబై ప్రజలు ఇకనైనా జాగ్రత్తగా మసులుకోకపోతే మరో లాక్డౌన్ తప్పకపోవచ్చునని అన్నారు. ముంబై నగరం మొత్తం లేదా ఆయా ప్రాంతాల పరిధిలో లాక్‌డౌన్‌కి అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.

చెంబూర్‌లో లాక్డౌన్ దిశగా?
‘చాలామంది జనం కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండానే ప్రయాణాలు చేస్తున్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోతే మనం మరో లాక్డౌన్ దిశగా వెళ్తాం. కాబట్టి మళ్లీ లాక్డౌన్ విధించాలా వద్దా అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.’ అని మేయర్ పడ్నేకర్ పేర్కొన్నారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న చెంబూర్ వంటి ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ముంబై వెస్ట్ వార్డు పరిధిలోని చెంబూరులో గతవారం ప్రతీరోజూ 15 వరకూ కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వారం అది 25కి పెరిగింది.

డిప్యూటీ సీఎం ఆందోళన…
ముంబైలో నెలకొన్న పరిస్థితిపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదని నా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింత దిగజారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పెరుగుతున్న కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మళ్లీ లాక్డౌన్ పాటిస్తుండటాన్ని గమనిస్తూనే ఉన్నాం.’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు.

పెరుగుతున్న కేసులు…
మహారాష్ట్రలో సోమవారం(ఫిబ్రవరి 15) కొత్తగా 3,365 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క ముంబై నగరంలోనే 493 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనాతో మృతి చెందారు. సోమవారం నాటికి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,643కు చేరగా, మరణాలు 51,552కు చేరుకున్నాయి. ఇందులో ఒక్క ముంబైలోనే ఇప్పటివరకూ 3,14,569 కేసులు నమోదవగా 11,420 మంది మృతి చెందారు.