కేంద్రమంత్రి ఏమంటున్నారు…
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రముఖ జాతీయా మీడియాతో మాట్లాడుతూ… దేశంలోని పవర్ గ్రిడ్ వ్యవస్థపై సైబర్ దాడి వెనుక చైనా హస్తం ఉందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అయితే సైబర్ హ్యాకింగ్ ప్రయత్నాలు మాత్రం జరిగాయని చెప్పారు.’ముంబై విద్యుత్ అంతరాయ ఘటన వెనుక చైనా ప్రమేయం ఉందని చెప్పేందుకు ఇప్పటికైతే ఎటువంటి ఆధారాలు లేవు. అయితే పవర్ లోడ్ డిస్పాచ్ సెంటర్లపై సైబర్ హ్యాక్ లేదా సైబర్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. దీనిపై అధికారిక బృందాలు అప్పట్లో వెంటనే కేంద్రానికి సమాచారమిచ్చాయి.’ అని వెల్లడించారు.

హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినప్పటికీ… నో ఎఫెక్ట్…
సైబర్ హ్యాకింగ్ లేదా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినప్పటికీ… పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్(POSOCO)పై అది ఎటువంటి ప్రభావం చూపించలేదని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డేటా కోల్పోవడం వంటిదేమీ జరగలేదని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి CERT-in, NCIIPC, CERT-Trans తదితర ఏజెన్సీల నుంచి వచ్చే ఫిర్యాదులపై POSOCO పరిధిలోని అన్ని కంట్రోల్ సెంటర్స్‌లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్(CISOs) దృష్టి సారించారని,వాటిపై చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించింది.

కేంద్రానికి సమాచారమిచ్చిన సంస్థలు…
POSOCO లోని కొన్ని కంట్రోల్ సెంటర్స్‌లో షాడో ప్యాడ్ అని పిలవబడే మాల్వేర్కు సంబంధించి CERT-In(The Indian Computer Emergency Response Team) నుంచి గతేడాది నవంబర్‌లో ఒక మెయిల్ వచ్చిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఎన్సీఐఐపీసీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని… చైనాకు చెందిన ఎడ్ ఎకో అనే సంస్థ ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారమిచ్చిందని తెలిపింది.

ఇప్పుడే చెప్పలేం : మహారాష్ట్ర
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర సైబర్ సెల్ ప్రాథమిక రిపోర్టును ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్ మాట్లాడుతూ… సైబర్ దాడికి ప్రయత్నం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వర్లను లక్ష్యంగా చేసుకుని మాల్వేర్ దాడి జరిగిందని… అయితే దీని వెనకాల ఏ దేశం పాత్ర ఉందన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

అసలు ఆరోజు ఏం జరిగింది…
అక్టోబర్ 13,2020న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. దీంతో ముంబైలో 2గంటలు,శివారు ప్రాంతాల్లో దాదాపు 12 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోడ్ డిస్పాచ్ సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ముంబై నగరంలో బ్లాక్ ఔట్ సంభవించింది. లోకల్ రైళ్లు కూడా రద్దయ్యాయి. ఆస్పత్రుల్లో జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. స్థానికంగా తలెత్తిన సాంకేతిక లోపాలే దీనికి కారణమని మొదట భావించినప్పటికీ… దీని వెనకాల చైనా కుట్ర దాగుందన్న కథనాలతో డ్రాగన్‌పై అనుమానాలు మొదలయ్యాయి.