Andhra Pradesh
oi-Chandrasekhar Rao
అమరావతి: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాటు పూర్తయ్యాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ఆరంభం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారు జామున 6:30 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. మావో్యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓ గంట ముందే పోలింగ్ ప్రక్రయి పూర్తవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
మొత్తం 13 జిల్లాల్లో 20 డివిజన్లు, 160 మండలాల్లో 2,640 పంచాయితీలకు పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజానికి- షెడ్యూల్ ప్రకారం మూడో విడతలో మొత్తం పంచాయతీలకు 3,221 ఓటింగ్ నిర్వహించాల్సి ఉండగా.. వాటిలో 579 ఏకగ్రీవం అయ్యాయి. ఫలితంగా- 2,640 పంచాయతీలకు ఓటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ దశలో పోటీలో మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 19,553 వార్డు సభ్యత్వం కోసం 43,162 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు.

మొత్తం 55,75,004 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడో విడతలో 26,851 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4,118, అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో 3,127 స్టేషన్లు ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా భధ్రతా ఏర్పాట్లు చేస్తోన్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
తొలి, మలి విడతల్లోనే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. ఆ పోలింగ్ తరహాలోనే ఈ సారి కూడా ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి స్పెషల్ పార్టీ పోలీసులను బరిలో దింపారు. వయోధిక వృద్ధులు, నడవడానికి ఇబ్బంది పడే వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి అధికారులు ప్రత్యేకంగా రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.
కాగా- తొలి రెండు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోయిందనే విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తం అయ్యాయి. ఈ రెండు దశల్లో టీడీపీ మద్దతుదారులు వైసీపీని ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారనే వార్తల మధ్య.. చివరి రెండింటి పోలింగ్‌పైనా టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఈ సారి గట్టిగా పోరాడాలంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదివరకే సూచించారు. మూడో విడతలో అధికార పార్టీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ భావిస్తోంది.