National
oi-Chandrasekhar Rao
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమౌతోన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఈ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి కృషి చేస్తోన్న ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారలు కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని.. ఈ అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం పట్ల నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నిజానికి- ఆదివారం నాటి ఆయన షెడ్యూల్లో ఈ అత్యున్నత స్థాయి భేటీ లేదు. అయినప్పటికీ పరిస్థితి తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అన్ ప్లాన్డ్గా ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 513 మంది మరణించారు. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల వరుసగా మూడోరోజు కూడా కొనసాగుతోంది. రెండురోజులుగా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా ఆ సంక్య 90 వేల మార్క్‌ను దాటింది.