Thursday, May 6, 2021

మోదీ పాలనలో భారతదేశం ‘పాక్షిక స్వతంత్ర దేశం’గా మారిపోయింది: ఫ్రీడమ్ హౌస్ నివేదిక

National

-BBC Telugu

By BBC News తెలుగు

|

భావ స్వేచ్ఛ

భారతదేశపు ‘స్వతంత్ర’ హోదా.. ‘పాక్షిక స్వతంత్రం’గా మారిందని ‘ఫ్రీడమ్ హౌస్’ వార్షిక నివేదిక పేర్కొంది. ప్రపంచ రాజకీయ హక్కులు, స్వాతంత్ర్యాలపై ఈ నివేదికను రూపొందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పౌర స్వాతంత్ర్యాలు క్షీణిస్తున్నాయని ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘డెమొక్రసీ అండర్ సీజ్’ నివేదికలో చెప్పింది.

ప్రజాస్వామ్యం, అధికారికతావాదం మధ్య సంతులనంలో జరిగిన మార్పుల్లో భాగంగా భారతదేశపు స్వతంత్ర హోదా మారిందని పేర్కొంది.

ఈ నివేదిక మీద భారత ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన ఏదీ రాలేదు.

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడమ్ హౌస్ స్వచ్ఛంద సంస్థ.. రాజకీయ స్వాతంత్ర్యం, మానవ హక్కుల అంశాల మీద పరిశోధన నిర్వహిస్తుంది. ‘స్వతంత్రం కాదు’ అనే వర్గీకరణలోకి వచ్చే దేశాల సంఖ్య 2006 తర్వాత ఇప్పుడు అత్యధికంగా ఉందని తెలిపింది.

భారతదేశం ”స్వతంత్ర దేశాల్లో అగ్ర స్థాయి నుంచి పతనం’’ కావటం.. ప్రపంచ ప్రజాస్వామిక ప్రమాణాల మీద మరింత నష్టదాయక ప్రభావం చూపవచ్చునని ఆ నివేదిక వ్యాఖ్యానించింది.

”2014 నుంచి మానవ హక్కుల సంస్థలపై పెరిగిన ఒత్తిడి, పాత్రికేయులు, ఉద్యమకారులకు బెదిరింపులు, ముఖ్యంగా ముస్లింల మీద దాడుల పరంపర.. దేశంలో రాజకీయ, పౌర స్వేచ్ఛలు క్షీణించటానికి కారణమయ్యాయని చెప్తోంది.

ఈ పతనం 2019 తర్వాత మరింత ”వేగవంతమైంద’’ని కూడా పేర్కొంది.

భారతదేశంలో హిందూ జాతీయవాద పార్టీ అయిన బీజేపీ 2014 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందింది. ఐదేళ్ల తర్వాత నరేంద్ర మోదీ మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.

”మోదీ నాయకత్వంలో భారతదేశం.. దేశ ఆవిర్భావ పునాదులైన సంలీనం, అందరికీ సమాన హక్కులను పణంగా పెడుతూ.. సంకుచిత జాతీయవాద ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచ ప్రజాస్వామ్య సారథిగా పనిచేయగల తన సామర్థ్యాన్ని వదిలేసిట్లు కనిపిస్తోంది’’ అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది.

సీఏఏ వ్యతిరేక నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై విరుచుకుపడటం.. ప్రజాస్వామ్య రేటింగ్‌లో భారత్ పతనమవటానికి కారణమైందని పేర్కొంది.

మతపరమైన అణచివేత నుంచి పారిపోయివచ్చిన వారికి ఈ చట్టం ఆశ్రయం కల్పిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే.. హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లింలను మరింత అణచివేయాలనే బీజేపీ ప్రణాళికలో భాగంగా ఈ చట్టం చేశారని విమర్శకులు అంటున్నారు.

కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం ప్రతిస్పందన కూడా.. అంతర్జాతీయంగా స్వేచ్ఛ పతనమవటానికి కారణమైందని ఈ నివేదిక పేర్కొంది.

గత ఏడాది మార్చిలో భారతదేశం ఆకస్మికంగా లాక్‌డౌన్ విధించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది వలస కూలీలు పని లేకుండా, ఇంటికి వెళ్లటానికి అవసరమైన డబ్బులు చేతిలో లేకుండా చిక్కుకుపోయారు. ఎంతో మంది వందల కిలోమీటర్లు నడుస్తూ ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో చాలా మంది తీవ్రంగా అలసిపోవటం వల్లనో, దారిలో ప్రమాదాల వల్లనో చనిపోయారు.

హాంకాంగ్ నిరసనలు

ఇతర దేశాల గురించి ఈ నివేదిక ఏం చెప్పింది?

చైనా సహా అనేక దేశాల గురించి ఈ నివేదిక ప్రస్తావించింది. కోవిడ్-19 విజృంభణ గురించి బయటికి పొక్కకుండా చేయటానికి చైనా చేసిన ప్రయత్నాల వల్ల వచ్చిన చెడ్డ పేరును తిప్పికొట్టటానికి ఆ దేశం ”అంతర్జాతీయంగా తప్పుడు సమాచారం, సెన్సార్‌షిప్ కార్యక్రమాన్ని’’ వ్యాపింపచేసిందని పేర్కొంది.

ఇక డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా చివరి సంవత్సరాల్లో అమెరికా కూడా ప్రజాస్వామ్య సూచీలో క్షీణించిందని ఈ నివేదిక చెప్పింది.

సామూహిక ప్రజా నిరసనలు, సాయుధ మూకలతో పాటు.. ”ఎన్నికల్లో తన ఓటమిని తలకిందులు చేయటానికి ట్రంప్ చేసిన దిగ్భ్రాంతికర ప్రయత్నాల’’ కారణంగా చివరికి గత జనవరిలో కాపిటల్ హిల్ మీద దాడి జరగటం.. ”విదేశాల్లో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీశాయి’’ అని వ్యాఖ్యానించింది.

”రాజకీయ హక్కులు, పౌర స్వాతంత్ర్యాలు క్షీణిస్తున్న దేశాల సంఖ్య.. గత 15 ఏళ్లలో ఈ హక్కులు, స్వాంత్ర్యాలు అత్యధికంగా పెరిగిన దేశాల సంఖ్యను దాటిపోయాయి’’ అని ఈ గ్లోబల్ ఫ్రీడమ్ నివేదిక తెలిపింది.

ప్రపంచ జనాభాలో 75 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 73 దేశాల స్వాతంత్ర్య స్కోరును ఈ నివేదిక తగ్గించింది.

”భారతదేశం ‘పాక్షిక స్వాతంత్ర్య’ దేశంగా క్షీణించటంతో.. ఇప్పుడు ప్రపంచ జనాభాలో 20 శాతం కన్నా తక్కువ మంది మాత్రమే స్వతంత్ర దేశంలో నివసిస్తున్నారు. 1995 నుంచి చూస్తే ఇదే అత్యల్పం’’ అని ఆ నివేదిక వివరించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
Source link

MORE Articles

Algorithmic Architecture: Using A.I. to Design Buildings | Digital Trends

Designs iterate over time. Architecture designed and built in 1921 won’t look the same as a building from 1971 or from 2021. Trends...

HEALTH NEWS: कद्दू के बीजों का पुरुष ऐसे करें सेवन, फिर देखें कमाल!

नई दिल्ली: अगर आप कद्दू खाते होंगे तो उसके बीजों का क्या करते हैं? कहीं फेंक तो नहीं देते? यदि फेंक देते हैं,...

త్వరపడండి..హోండా యాక్టివాపై అదిరిపోయే డిస్కౌంట్: పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా హోండా యాక్టివా 6 జి యొక్క 20 వ యానివర్సరీ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని మార్కెట్లో ప్రస్తుతం 69,343 రూపాయలకు...

30 జిల్లాల్లో ఏడు మనవే.. నవరత్నాలు ఎందుకు, మారెడ్డి అంటూ రఘురామ చిందులు

చీమ కుట్టినట్లయినా లేదు.. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని చెప్పారు. వైరస్ విషయంలో ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe