News
oi-Chandrasekhar Rao
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట జోరుగా సాగుతోంది. చెన్నై గ్రాండ్ చోళ హోటల్.. దీనికి వేదికైంది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మినీ వేలం పాట ద్వారా 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.
ఇందులో 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనికోసం 196.6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోన్నాయి. మొత్తం 292 మంది క్రికెటర్లు మినీ ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిజంగా అదృష్టవంతుడే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-2020 సీజన్ 13లో ఏ మాత్రం రాణించలేకపోయినప్పటికీ.. అతనికి ఉన్న డిమాండ్ మాత్రం తగ్గనే లేదు. పైగా మరింత పెరిగింది కూడా.

మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలం అయ్యాడు. సీజన్ మొత్తానికీ అతను ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌లోనూ భారీ స్కోరును నమోదు చేయలేకపోయాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఫలితంగా- అతణ్ని వదులుకుంది పంజాబ్ కింగ్స్. దీనితో అతను ఈ సారి మినీ ఆక్షన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ మినీ వేలం పాట సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం ఏకంగా 14 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు పెట్టబోతోంది. 14.25 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంది.
అడుగు పెడుతూనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అత్యధిక వేతానాన్ని అందుకుంటోన్న క్రికెటర్ల జాబితాలో చేరాడు మ్యాక్స్. ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్‌లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ అతనికి సంవత్సరానికి 17 కోట్ల రూపాయల వేతనాన్ని చెల్లిస్తోంది. ఒకేసారి రెండో స్థానానికి చేరాడు మ్యాక్స్‌వెల్. అతనికి వేతనం రూపంలో సంవత్సరానికి 14.25 కోట్లను ఆర్సీబీ చెల్లిస్తుంది. మూడో స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. అతని వేతంన 11.5 కోట్ల రూపాయలు. కాగా- ఆస్ట్రేలియాకే చెందిన స్టీవ్ స్మిత్ డిమాండ్ ఈ సారి బాగా తగ్గింది. 2.2 కోట్ల రూపాయలకు ఢిల్లీ కేపిటల్స్ అతన్ని తీసుకుంది.