జగన్ రెడ్డి నరనరాల్లో విపరీతమైన అధికార వ్యామోహం గూడుకట్టుకుని ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లకుపైనే దోచుకున్నా.. ఆయన ధనకాంక్ష తీరలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇంకెంత ఆర్జించారో లెక్కాపత్రం లేదు. నిరుటి ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా.. 175 సీట్లు గెలుస్తామన్న ఆయన ప్రగల్భాలను 11 సీట్లతో చీల్చిచెండాడినా.. ఆయనకు కించిత్తు బాధయినా లేదు.
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముందే ఊహించేశారు. ఫలితాల రోజున ఆయన మాటల్లో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు. జనం ఎందుకు ఓడించారో ఆత్మపరిశీలన లేదు. వారేదో పాపం చేసినట్లుగా.. చంద్రబాబు మాటలు విని మోసపోయినట్లుగా.. ఆయన హామీలు నెరవేర్చరన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడూ అదే మాట్లాడుతున్నారు.
వచ్చిన అవకాశాన్ని ప్రజల మేలుకు ఉపయోగించకుండా.. వారికి ముష్టి వేసి.. అభివృద్ధి పనులను అటకెక్కించి.. లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. వాటిని, ఆదాయాన్ని ఎటెటో మళ్లించుకుని.. బెంగళూరు ప్యాలెస్‌లోనే మకాం వేసి.. అడపాదడపా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తున్న ఆయన.. 2029లో తానే గెలుస్తానని.. 30 ఏళ్లు అధికారంలో కొనసాగుతానని ఊహాలోకంలో బతికేస్తున్నారు.
కళ్లుమూసుకుంటే చంద్రబాబు వచ్చి 9 నెలలు గడచిపోయాయని.. ఇలాగే మిగతా నాలుగేళ్ల మూడు నెలలు ముగుస్తాయని.. వైసీపీ శ్రేణులంతా బయటకు వచ్చి పోరాడాలని పిలుపిస్తున్నారు. అయితే ఆయన పిలుపిచ్చిన నిరసన కార్యక్రమాలకు జనస్పందన లేకపోగా… వైసీపీ కార్యకర్తలే పాల్గొనడం లేదు. ఐదేళ్లలో 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి జనంపై భారీ భారం మోపింది తమ నాయకుడేనని, ప్రజలు తమను ఓడించడానికి ఇది ప్రధాన కారణమని వారికి తెలుసు. ఈ విషయం ఎన్నికల ముందే ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలకు చెప్పినా లాభం లేకపోయింది.
జగన్‌కు ఈ విషయం చెప్పే ధైర్యం వారికి లేదు. ఆయనకు తెలియని విషయం కాదులే అని వారు కూడా మౌనంగా ఉండిపోయారు. విద్యార్థులకు ఫీజు బకాయిల కింద రూ.4,100 కోట్లు బకాయిపెట్టిపోయిన జగన్.. చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేసారని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫీజుపోరుకు పిలుపిచ్చారు. వైసీపీ నేతలు అంగీకరించలేదు. ఒక విడత ఫీజు బకాయిలను విద్యామంత్రి లోకేశ్ చెల్లించారని.. ఇది జనంలోకి బాగా వెళ్లిందని.. ఈ పరిస్థితుల్లో రోడ్డెక్కితే పరువు పోతుందని వారు మొత్తుకున్నారు.
కానీ జగన్ వినిపించుకోలేదు. జరపాల్సిందేనన్నారు. అయితే ఈలోపు పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో.. కోడ్ సాకుతో పోరును వాయిదావేశారు. ఆ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ మద్దతుతో పోటీచేసిన వామపక్ష పీడీఎఫ్ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.
బాబుకు ప్రతిపక్షనేత హోదా నేనే ఇచ్చా!!
మనం మాట్లాడేది నిజమో, అబద్ధమో ప్రజలకు తెలియదని జగన్ నిశ్చితాభిప్రాయం. అసెంబ్లీలో 18 సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదన్నది ఆయనకూ తెలుసు. వైసీపీ నుంచి 11 మంది మాత్రమే గెలియినా.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని.. లేదంటే సభకు రానని 9 నెలలుగా మారాం చేస్తూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు.. స్పీకర్‌కు లేఖలు రాశారు.. మీడియా సమావేశంలోనూ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అడుగుపెడితే తనను అవమానిస్తారని.. ఎక్కువ సేపు మైకు ఇవ్వరని ఆయన ఆందోళన చెందుతున్నట్లు కనబడుతోంది.
2019లో వైసీపీ గెలిచాక అసెంబ్లీ మొదటిసారి సమావేశమైనప్పుడు నాటి మాజీ సీఎం చంద్రబాబును సభలో అధికార పక్షం సూటిపోటి మాటలతో ఎంతగానో అవమానించింది. గతంలో పదేళ్లు విపక్షంలో ఉన్న ఆయన. చాలాకాలం ఆ బాధను దిగమింగుకుంటూ వచ్చారు. కానీ సభలో తన భార్య భువనేశ్వరి పట్ల వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడడం సహించలేకపోయారు. కౌరవ సభలో తాను ఉండనని.. గౌరవ సభగా మారిన తర్వాత సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.
అన్నట్లుగానే సీఎంగానే సభలో ప్రవేశించారు. తనను కూడా టీడీపీ కూటమి అవమానిస్తుందని జగన్ అనవసరంగా భయపడుతున్నారా.. లేక ఆ సాకుతో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ ఎందుకు వెంపర్లాడుతున్నారు? సభానాయకుడు అంటే సీఎం సభలో ఎంతసేపు మాట్లాడితే.. విపక్ష నేతకు కూడా అంత సేపు మాట్లాడే అవకాశం దక్కుతుందని ఆయన అంటున్నారు. అదే నిజమైతే చంద్రబాబుకు ఆయన అసలు అవకాశమిచ్చారో లేదో.. మనస్సాక్షి ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలని టీడీపీ నేతలు అంటున్నారు.
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మాట్లాడేందుకు నిలుచున్న వెంటనే వైసీపీ సభ్యులు అరుపులూ కేకలు వేయడం… నాటి సభాపతి తమ్మినేని సీతారాం మైక్ కట్ చేయడం.. సభ జరిగిన ప్రతి రోజూ ఇదే పరిస్థితి. సభను చంద్రబాబు బహిష్కరించినా టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం యథాప్రకారం అసెంబ్లీ సమావేశాలకు ఆయన పంపారు. ఇప్పుడు జగన్ తన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఛాయలకైనా రానివ్వడం లేదు. తాను మాత్రం కూలి మీడియాను ముందేసుకుని గంటల కొద్దీ మాట్లాడుతున్నారు.
బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్ష నేత ప్రారంభించడం ఆనవాయితీ. 2022లో చంద్రబాబుకు ఆ అవకాశమివ్వలేదు. పాలక పక్షానికి మైకిచ్చారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబును తానే నియమించానంటూ జగన చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో (175) పదిశాతం సీట్లు (18) గెలిచే పార్టీ నేతకే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి. సంప్రదాయాల మేరకు టీడీఎల్పీ నేత చంద్రబాబును ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారు.
కానీ తన దయాదాక్షిణ్యాలతోనే ఆయనకా గుర్తింపు వచ్చిందని.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారని.. మిగతావారిని కూడా లాగేద్దాం.. ఆయన విపక్షనేత హోదాను తీసేద్దామని తన పార్టీ నేతలు చెబితే తాను అంగీకరించలేదని జగన్ అన్నారు. తన అధికార పరిధిలో లేని అధికారాలను కూడా తనకు అన్వయించుకోవడం.. ఐదేళ్లు ఆయన పాలన జరిగిన తీరును ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సభకు రాకుండా బడ్జెట్‌పై విశ్లేషణ
ఫిబ్రవరి 24న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనూహ్యంగా జగన్ అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. కొత్త సభ కొలువు తీరాక శాసనసభ్యుడిగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఆయన సభకు వచ్చారు. ఆ తర్వాత ఆయన గానీ, వైసీపీ ఎమ్మెల్యేలు గానీ రాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వరుసగా 60 రోజులు హాజరుకాకపోతే సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇటీవల ప్రస్తావించారు.
దీంతో బెంబేలెత్తిన జగన్.. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. పట్టుమని 11 నిమిషాలు కూడా సభలో ఉండకుండా… తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రచ్చచేయించి బయటకు వెళ్లిపోయారు. అయితే స్పీకర్ అధ్యక్షతన సభ జరిగితేనే ఆ రోజు లెక్కలోకి వస్తుందని.. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు పనిదినం కిందకు రాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకూ వైసీపీ సభ్యులు రాలేదు.
ఇక మార్చి 1న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ పెట్టినప్పుడూ జగన్ అండ్ కో పత్తా లేరు. జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు చెక్కేసి తీరిగ్గా మార్చి 6న తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నారు. సొంత, కూలి మీడియాను పిలిపించుకున్నారు. బడ్జెట్‌పై రెండు గంటలు అనర్గళంగా మాట్లాడారు. కానీ ఆయన ఏం చెప్పదలిచారో జర్నలిస్టులకు అసలు అవగతమే కాలేదు. పైగా మీడియా ముందు తాను చెప్పినవాటికి ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పాలనడంతో వారు విస్తుపోయారు. ఘోరపరాజయం పాలైనా ఆయన ఇంకా తనను తాను సీఎంగానే భావిస్తున్నట్లుగా ఉందని పక్కకు వచ్చి నవ్వుకున్నారు.
The post మ్యాగజైన్ స్టోరీ: ఇంకా ‘30 ఏళ్ల’ భ్రమల్లోనే జగన్! first appeared on namasteandhra.


