బాలిక కుటుంబం ఏమంటున్నది…
మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలు(16) అక్రాబాద్ అనే గ్రామంలో నివసిస్తోంది. గత ఆదివారం(ఫిబ్రవరి 28) ఉదయం 11గంటల సమయంలో ఆమె పశు గ్రాసం కోసం ఇంటి నుంచి పొలానికి వెళ్లింది. అయితే సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులంతా ఆమె కోసం గాలించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఓ పంట పొలంలో ఆమె శవమై కనిపించింది.

రాళ్లు రువ్విన గ్రామస్తులు…
ప్రాథమిక విచారణలో బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందని స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే అత్యాచారం జరిగింది లేనిది పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చాకే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు వెళ్లగా… గ్రామస్తులు వారిపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ ఇన్స్పెక్టర్కి గాయాలైనట్లు సీనియర్ సూపరింటెండెంట్ మునిరాజ్ తెలిపారు.

కొద్దిరోజుల క్రితమే ఇద్దరు బాలికల హత్య…
ఈ ఘటనపై దర్యాప్తుకు ఎస్పీ అరవింద్ కుమార్ నేత్రుత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. అనుమానితుల కదలికల కోసం గాలిస్తున్నామని… త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు. పోస్టుమార్టమ్ నివేదిక వస్తే తప్ప బాలికపై అత్యాచారం గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. కొద్దిరోజుల క్రితం ఇదే యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు దళిత బాలికలను ఓ యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. వాటర్ బాటిల్లో విషం కలిపి ఇవ్వడంతో ఆ నీటిని తాగిన ముగ్గురు బాలికల్లో ఇద్దరు మృతి చెందారు. ఆ ముగ్గురిలో ఒకరిని ఇష్టపడ్డ ఆ యువకుడు… తన ప్రేమను ఆమె తిరస్కరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.