Stock Market Update: 

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం రక్తమోడుతున్నాయి! బెంచ్‌మార్క్‌ సూచీలు ఊహించని విధంగా పతనమవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద కళ్లముందరే ఆవిరవుతోంది. యూఎస్‌ ఫెడ్‌ సమావేశానికి ముందు యూఎస్‌ బాండ్‌ ఈల్డులు 16 ఏళ్ల గరిష్ఠాలకు చేరుకోవడంతో మార్కెట్లు ఎరుపెక్కాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీలు నష్టాలను మరింత పెంచాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లు పతనమైంది. ఒక శాతం నష్టంతో 67,000 స్థాయికి తగ్గింది. 66,887 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఇక నిఫ్టీ 19,936కు చేరుకుంది. 198 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1.92 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.321.08 లక్షల కోట్లకు తగ్గింది. సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ టాప్‌ లాసర్స్‌గా ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీతో విలీనమయ్యాక జులై ఒకటి తర్వాత స్థూల నిరర్థక ఆస్తులు పెరిగే అవకాశం ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 3 శాతం మేర పతనమయ్యాయి. అయితే ఐఏఎఫ్‌తో రూ.291 కోట్ల ఒప్పందం కుదురడంతో భారత్‌ డైనమిక్స్‌ షేర్లు మూడు శాతం పెరగడం ఉపశమనం ఇచ్చింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 స్వల్ప లాభాల్లో ఉండటం గమనార్హం.

సమీప భవిష్యత్తులో మార్కెట్లకు కఠిన సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బెంట్ క్రూడాయిల్‌ 94 డాలర్లకు పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 106 స్థాయికి ఎగిసింది. రెండేళ్ల యూఎస్‌ బాండ్‌ ఈల్డు 5.09 శాతానికి చేరింది. రూపాయి జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వీటికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ తగ్గుతుందన్న వార్తలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని జియెజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అంటున్నారు. నిఫ్టీ 19,865 కన్నా దిగువకు వస్తే పతనం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

పదేళ్ల అమెరికా బాండు యీల్డు 16 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఆసియా స్టాక్స్‌ పతనమవుతున్నాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను అధిక స్థాయిల్లోనే ఉంచుతుందన్న అంచనాలు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు దోహదం చేశాయి. ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికర పద్ధతిలో రూ.1237 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే డొమస్టిక్‌ ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల మేరకు కొనుగోళ్లు చేపట్టారు. క్రూడాయిల్‌ ధరలు ఇలాగే పెరిగితే మున్ముందు కష్టాలు మరింత పెరుగుతాయి.

చివరి సెషన్లో ఏం జరిగింది?

స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హాంకాంగ్‌, సింగ్‌పూర్‌, కొరియా సూచీలు ఎరుపెక్కగా మొన్నటి వరకు పతనమైన చైనా సూచీలు పుంజుకున్నాయి. ఈ వారం యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కానుండటం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పైగా భారత సూచీలన్నీ గరిష్ఠాల్లోనే ఉండటంతో ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 కీలకమైన 20,100 లెవల్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *