కేంద్రమంత్రులకే పరిమితమైన చోట..
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సారథ్యంలో ఎంపీలు ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలంటూ వినతిపత్రాలను ఇచ్చారు. బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీ కూడా కేంద్రమంత్రిని కలవడం వరకే పరిమితమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిశారు. వారి డిమాండ్లను వారు వినిపించారు.

తొలిసారిగా ప్రధాని వద్ద నేరుగా..
ఈ పరిణామాల మధ్య వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత.. రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రదానితో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీ వద్ద తనకు ఉన్న పలుకుబడిని, పరపతిని రఘురామ కృష్ణంరాజు మరోసారి నిరూపించుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానికి..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ ద్వారా మాత్రమే ప్రధానికి వినిపించగలిగారు. ప్రభుత్వ వైఖరిని ఆయన ఈ లేఖ ద్వారా స్పష్టం చేయగలిగారు. స్టీల్ ప్లాంట్ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావాలో వివరించగలిగారు. ప్రధానిని కలిసే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఈ అంశంపై చర్చించడానికి వైఎస్ జగన్.. ప్రధాని అపాయింట్మెంట్ను కూడా కోరలేదనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ విషయాన్ని పునరాలోచించాలంటూ రఘురామ కృష్ణంరాజు నేరుగా ప్రధానికే విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది.

బీజేపీ సానుభూతిపరుడిగా..
వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ.. రఘురామ కృష్ణంరాజుకు భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడిగా గుర్తింపు ఉంది. కారణాలేమైనప్పటికీ.. రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆయన బీజేపీకి చేరువ కావడానికే ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం అనంతరం వైసీపీపై ఓ మినీ యుద్ధాన్నే చేస్తోన్నారాయన. ఏ మాత్రం అవకాశం దొరికినా రఘురామ కృష్ణంరాజు కాషాయ కండువాను కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది.