National
-BBC Telugu
జలియన్‌వాలా బాగ్ మారణకాండకు ఆరేళ్ల ముందు రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో మాన్‌గఢ్ కొండ మీద జరిగిన ఊచకోత గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
జలియన్‌వాలా బాగ్ ఉదంతంలో వెయ్యిమందికి పైగా భారతీయులు బ్రిటిష్ తూటాలకు బలైపోయారు.
మాన్‌గఢ్ ఉదంతంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.
స్థానిక రాజ్యాల సైనికుల సహాయంతో ఆంగ్లేయులు పకడ్బందీగా ప్రణాళిక రచించి మాన్‌గఢ్ కొండపైకి చేరిన వేలాదిమందిపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఈ సంఘటన జలియన్‌వాలా బాగ్ ఉదంతం కన్నా పెద్దది అని సాహిత్యకారులు, చరిత్రకారులు, స్థానికులు కూడా పేర్కొన్నారు.
కానీ, ఈ దుర్ఘటన చరిత్రపుటల్లో చోటు దక్కించుకోలేదు.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 550 కిలోమీటర్ల దూరంలో ఆదివాసీలు అధికంగా నివసించే బన్స్వారా జిల్లా ప్రధాన కార్యాలయం నుంచీ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మాన్‌గఢ్ కొండ.
ఆనందపురి పంచాయతీ సమితి ప్రధాన కార్యాలయం నుంచీ ముందుకు వెళుతూ ఉంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ కొండ కనిపిస్తుంది.
108 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోతకు ఆ కొండే సాక్ష్యం.
స్థానికులు దాన్ని మాన్‌గఢ్ ధామ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం 80 శాతం రాజస్థాన్‌లో, 20 శాతం గుజరాత్లో ఉంది.
మాన్‌గఢ్ కొండ ఎత్తు 800 మీటర్లు. దీని చుట్టూ అడవి ఉంది.
ఈ కొండపై మారణకాండ జరిగిన తరువాత సుమారు 80 ఏళ్ల వరకూ ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
గత రెండు దశాబ్దాలలో ఇక్కడ అమరవీరుల స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మించారు. రోడ్డు వేశారు.
గత ఇరవై ఏళ్లల్లోనే మాన్‌గఢ్ చరిత్ర ప్రజలకు తెలియడం మొదలైంది.
ఇక్కడ ఊచకోత జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా గుర్తించింది.
మాన్‌గఢ్ ఊచకోత జరిగిన దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత 1999 మే 27న.. ఈ ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం రాజస్థాన్ ప్రభుత్వం ఇక్కడ అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించింది. దాంతో ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చింది.
ఈ ప్రాంతపు చరిత్ర తెలుసుకోవడానికి బన్స్వారా ఎమ్మెల్యే, మాజీ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి మహేంద్రజీత్ సింగ్ మాలవీయ కొంత కృషి చేశారు.
“నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి, దిల్లీ నేషనల్ ఆర్కైవ్స్ నుంచీ ఈ ప్రాంతం చరిత్రను సేకరించడానికి ప్రయత్నించాను. మెల్లి మెల్లిగా దీని చరిత్ర ప్రజలకు తెలుస్తోంది. ఇది సంతోషించాల్సిన విషయం” అని మహేంద్రజీత్ తెలిపారు.
మాన్‌గఢ్ కొండపై గోవింద గురు విగ్రహం, ఒక ధుని ఉన్నాయి. మాన్‌గఢ్ చరిత్ర తెలిపే సమాచారం శిలాఫలకాలపై చెక్కి ఉంది.

మాన్‌గఢ్ మారణకాండ ఎలా జరిగిందంటే..
దుంగార్పూర్ జిల్లాలోని బన్సియా (వేద్సా) గ్రామానికి చెందిన బంజారా కులంలో జన్మించిన గోవింద గురు 1880లలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ఉద్యమాలు లేవదీశారు.
బ్రిటిష్ వారి దురాగతాలు, స్థానిక రాజులు విధించిన పన్నులు, బేగారి వ్యవస్థతో ప్రజలు పోరాడుతున్న కాలం అది.
“బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలను అంటరానివారిగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తన ఉద్యమాల ద్వారా గోవింద గురు ప్రజల్లో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకు వచ్చారు” అని చరిత్రకారులు, విశ్రాంత అధ్యాపకులు బీకే శర్మ తెలిపారు.
ధునిలో పూజలు చేయమని.. మద్యం, మాంసం స్వీకరించవద్దని, నిజాయితీగా ఉండాలని గోవింద గురు పిలుపునిచ్చారు. ఆయన కలిగించిన చైతన్యంతో దొంగతనాలు, దోపిడీలు తగ్గిపోయాయి. మద్యం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం తగ్గిపోయింది.

“1903లో గోవింద గురు సంప్ సభను స్థాపించారు. ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని భగత్ ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమం క్రమేణా విస్తరిస్తూ వచ్చింది. గోవింద గురు నేతృత్వంలో గిరిజనులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని రాచరికపు ప్రభుత్వాలు భావించాయి” అని ‘ధుని తపే తీర్” పుస్తక రచయిత, మాజీ ఐపీఎస్ అధికారి హరిరాం మీణా తెలిపారు.
అయితే, గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నట్టు స్థానిక రాజులు భావించడం, అందుకే మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం నిజమేగానీ సంప్ సభను స్థాపించినది గోవింద గురు కాదని చరిత్రకారులు, విశ్రాంత అధ్యాపకులు అయిన వీకే వశిష్ఠ అభిప్రాయపడ్డారు.
గోవింద గురు చేపట్టిన జనజాగృతి ఉద్యమం బాగా విస్తరించడం, రాచరికపు వ్యవస్థ ఫిర్యాదులతో బ్రిటిష్ వాళ్లు గిరిజనులపై నిఘా పెంచారు.
చివరకు 1913 నవంబర్ 17న మాన్‌గఢ్ కొండపై ఊచకోతకు పాల్పడ్డారు.

గోవింద గురు ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. మాన్‌గఢ్ కొండపై ప్రజలు చాలా రోజులుగా యాగం చేస్తున్నారు. వారంతా అక్కడికి వస్తూ పోతూ ఉన్నారు.
మాన్‌గఢ్ కొండని ఖాళీ చేయమని బ్రిటిష్ ప్రభుత్వం గోవింద గురుకు నవంబర్ 13, 15 తేదీల్లో ఆదేశాలు ఇచ్చిందని నేషనల్ ఆర్కైవ్స్ లేఖలు తెలుపుతున్నాయి.
అయితే, కొండపై యాగం జరుగుతోందని, ప్రజలు వస్తూ పోతూ ఉన్నారని గోవింద గురు వారికి చెప్పారు.
“గుజరాత్నుంచీ కుండా, బన్స్వారాకు చెందిన బన్షియాలు ఆనందపురి, మోర్చా వైపునుంచీ మాన్‌గఢ్ కొండను చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటిష్ వారితో పాటూ బన్స్వారా, దుంగార్పూర్, బరోడా, జోగ్ర్బారియా, గైక్వాడ్ రాజ్యాల సైనికులు, మేవాడ్ భిల్ కార్ప్స్ కంపెనీ కూడా పాలుపంచుకున్నాయిష అని గుజరాత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అరుణ్ వాఘేలా వివరించారు.
సైనికులు మాన్‌గఢ్ కొండ మ్యాప్ తయారు చేశారు. మెషిన్ గన్లు, ఫిరంగులను కొండపైకి చేర్చారు.
ఆరోజు ఉదయం 6.30 గంటలకు మేజర్ హామిల్టన్, మరొక ముగ్గురు అధికారులతో కలిసి మాన్‌గఢ్ కొండను చుట్టుముట్టారు.
పొద్దున్న 8.10 గంటలకు మొదలైన కాల్పులు 10 గంటల వరకూ కొనసాగాయి.
ఆ రోజు జరిగిన సంఘటనలను వివరిస్తూ.. “కాల్పుల్లో మరణించిన ఒక మహిళ చనుబాలను తాగడానికి ప్రయత్నిస్తున్న ఆమె బిడ్డను చూసి బ్రిటిష్ వారు కాల్పులు విరమించార’’ని స్థానిక కుండా ప్రజలు చెప్పారు.
ఏడో జాట్ రెజిమెంట్, తొమ్మిదవ రాజపుత్ రెజిమెంట్, 104 వెల్స్రెజ్ రైఫిల్ రెజిమెంట్, మాహు, బరోడా, అహ్మదాబాద్ కంటోన్మెంట్ల నుంచీ ఒక్కొక్క కంపెనీ, మేవార్ భిల్ కార్ప్స్ నుంచీ రెండు కంపెనీలు పాల్గొన్నాయని నేషనల్ ఆర్కైవ్స్ పత్రాలు చెబుతున్నాయి.
“ఒక్కొక్క కంపెనీలో సుమారు 120 మంది సిపాయిలు ఉంటారు. అందులో 100మంది సాయుధ సైనికులు ఉంటారు. అలాంటి కంపెనీలు మేవార్, దుంగార్పూర్, ప్రతాప్‌గఢ్, బాన్స్వారా, కుశల్‌గఢ్ రాజ్యాల నుంచీ వచ్చాయి. వెయ్యిమందికి పైగా సైనికులు ఈ మారణకాండలో పాల్గొన్నారు. నా పరిశోధన ప్రకారం మాన్‌గఢ్ ఊచకోతలో సుమారు 1500 మంది మరణించారు. వీరిలో 700 మంది దాకా తుపాకీ గుళ్లు తగిలి చనిపోయారు. మిగిలినవారు కొండపై నుంచీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు” అని హరిరాం మీణా చెప్పారు.

ఈ మారణకాండలో 1500 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇక్కడి మ్యూజియంలో లభించిన సమాచారం, మాన్గఢ్పై రాసిన పుస్తకాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రొఫెసర్ బీకే శర్మ కూడా ఈ సంఖ్యను ధృవీకరించారు.
ఈ సంఘటనలో ఎంతమంది చనిపోయారన్న విషయం సైనికులు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుపలేదుగానీ “మాన్‌గఢ్ కొండను ఖాళీ చేయించామని, ఎనిమిది మంది గాయపడ్డారని, 900 మంది లొంగిపోయారని” తెలిపారు.
ఈ ఘటన తరువాత గోవింద గురు శిష్యుడు పూంజా పార్గీని శిక్షించారు.
గోవింద గురుకు మొదట జీవిత ఖైదు విధించారు. తరువాత, బన్స్వారా, సంత్రాంపూర్, మాన్‌గఢ్ వెళ్లకూడదని షరతులు విధిస్తూ ఆయన్ను విడుదల చేశారు.
అలా గిరిజనుల ఉద్యమం ఊచకోతగా మారి అణచివేతకు గురైంది.
అనంతరం, గోవింద గురు 1920లో కన్ను మూశారు. ఇప్పటికీ గోవింద గురును ఆరాధించేవారు ఉన్నారు.
అయితే, అప్పటినుంచీ 80ల వరకు మాన్‌గఢ్‌కు రాకపోకలను అనుమతించలేదు.
“ఈ మారణకాండ తరువాత చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ఊళ్లకు వెళిపోయారు” అని ప్రొఫెసర్ అరుణ్ వాఘేలా తెలిపారు.
మాన్‌గఢ్ మారణకాండలో మా తాత హాలా, నానమ్మ ఆమ్రీ బ్రిటిష్ తుపాకీ గుళ్లకు బలయ్యారు. అప్పట్లో వాళ్లు బావ్రీలో నివసించేవారు. ఈ ఊచకోతలో 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారి శవాలు ఇక్కడే కుళ్లి కృశించిపోయాయి” అని మాన్‌గఢ్‌కు చెందిన మహంత్ రామచంద్ర గిరి తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా నవంబర్ 17న మాన్‌గఢ్‌లో అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. ఆరోజు, ఊచకోతలో మరణించినవారికి నివాళులు అర్పిస్తూ పూజలు నిర్వహించడంతోపాటూ గోవింద గురు భజనలు చేస్తారు.
“ఆ ఉదంతం తరువాత ఎక్కడైనా గిరిజనులు గుమికూడితే ‘మాన్‌గఢ్ పునరావృతమవుతుంది’ అని బెదిరించేవారు. 1938లో గుజరాత్లో దాహోద్‌లోని విరాట్ ఖేడీలో గుమికూడిన గిరిజనులను మాన్‌గఢ్ పేరు చెప్పి చెల్లాచెదురు చేశారు” అని అరుణ్ వాఘేలా తెలిపారు.
“జలౌద్ దగ్గర గోవింద గురు అంతిమ సంస్కారాలు జరిగాయి. అక్కడ ఆయన సమాధి, ఆశ్రమం ఉన్నాయి. ఇక్కడి గిరిజనులు ఆయన సమాధిపై జొన్నపొత్తులు నైవేద్యంగా సమర్పించేవరకు ఆహారం తీసుకోరు. ఇది ఇక్కడి సాంప్రదాయం” అని బన్స్వారా ఎమ్మెల్యే మహేంద్రజీత్ సింగ్ మాలవీయ తెలిపారు.
“గుజరాత్‌వైపు ఉన్న మాన్‌గఢ్ కొండపై స్మృతి వనం నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మాన్‌గఢ్ ఉదంతంలో మరణించినవారి సంఖ్య 1507 కన్నా ఎక్కువ అని ఇక్కడ ఫలకంపై రాశారు” అని ప్రొఫెసర్ అరుణ్ వాఘేలా తెలిపారు.
చరిత్రలో మాన్‌గఢ్ ఘటన ప్రాముఖ్యమైనదని చరిత్రకారులు అంగీకరిస్తారు.
అయితే, చరిత్రపుటల్లో దీనికి ఎందుకు స్థానం ఇవ్వలేదు? అనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తున్నారు.
ఇటీవల ఇక్కడ పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు బ్రిటిష్ వారి త్రీ నాట్ త్రీ బుల్లెట్లు లభించాయని, వాటిని ఉదయపూర్ మ్యూజియంలో ఉంచారని మహేంద్ర మాలవీయ తెలిపారు.
ఇంత పెద్ద సంఘటనకు చరిత్రపుటల్లో స్థానం దక్కకపోయినా, మెల్ల మెల్లగా ప్రజలు దీని గురించి తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)