నిమ్మగడ్డ లోపల ఉండగానే..
మొత్తం నాలుగు విడతల్లో జరుగుతోన్న ఏపీ పంచాయితీ ఎన్నికల ప్రహాసనంలో తొలి దశ పోలింగ్ మంగళవారం(ఫిబ్రవరి 9న) జరుగనుండగా.. సంబంధిత ఏర్పాట్లు, సర్కారుతో సమస్యలను విన్నవించుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారాన్ని కూడా చర్చించారు. మంత్రిపై చర్యలకు ఎందుకు ఆదేశించింది, వాటిపై హైకోర్టు తీర్పు, ఈనెల 21 వరకూ పెద్దిరెడ్డి మీడియాకు దూరంగా ఉండాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలపై కూడా గవర్నర్కు ఎస్ఈసీ వివరణలు ఇచ్చుకున్నారు. అయితే, నిమ్మగడ్డ రాజ్ భవన్ లో ఉండగానే.. తొలి నుంచీ ఆయనతో విభేదిస్తోన్న ప్రభుత్వ ముఖ్యులు కూడా లోపలికి వెళ్లడం గమనార్హం..
అదను చూసి దెబ్బకొట్టిన మోదీ -కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ పదవి గల్లంతు -జమ్మూకాశ్మీర్ అనాధ

రాజ్ భవన్లో పంచాయితీ!
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్ భవన్ లోపల ఉన్న సమయంలోనే.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరాంలు కూడా గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారు. పంచాయితీ ఎన్నికల వివాదాల్లొ తొలి నుంచీ కనిపించని మంత్రి బుగ్గన సడెన్ గా గవర్నర్ తో భేటీకి రావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాలేక బుగ్గనను పంపారా? లేక స్ట్రాటజీలో మార్పా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు, రాజ్ భవన్ లోపల గవర్నర్.. ఇరు వర్గాలను ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడారా? లేదా? అనేది కూడా క్లారిటీ లేదు. అయితే, ఇద్దరూ ఏక కాలంలో ఎన్నికల అంశంపైనే కలిసిన నేపథ్యంలో అటు ఎస్ఈసీకి, ఇటు సర్కారుకు గవర్నర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే..

ఏకగ్రీవాలకు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
రాజ్ భవన్ లో భేటీ తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణాయలను వెలువరించారు. ఇంకొద్ది గంటల్లోనే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంచిన ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు మంగళ, బుధ వారాల్లో డిక్లరేషన్లు ఇవ్వాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ముందే ఏకగ్రీవం అయినప్పటికీ, ఫిర్యాదులు రావడంతో వాటిని లోతుగా పరిశీలించిన అనంతరం ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అయితే..

నిమ్మగడ్డకు మరో దారి లేకుండా..
పంచాయితీలు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డకు మరో ఆప్షన్ లేదు కాబట్టే ఆమోదింక తప్పలేదని తెలుస్తోంది. రేపు ఉదయం పోలింగ్ పెట్టుకుని, ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలకు నో చెబితే అనవసర చిక్కులు తలెత్తుతాయి కాబట్టే గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ పనిని ఊరికే కాకుండా, గవర్నర్, ప్రభుత్వ ముఖ్యులకు గుర్తుచేసిమరీ చేయడాన్ని ఎస్ఈసీ స్ట్రాటజీగా అవలంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డకు మరో దారి ఉండదని తెలుసు కాబట్టే జగన్ సర్కారు సైతం పట్టుబిగించినట్లుగా కనిపిస్తోంది. ఇరు పక్షాలు పరస్పర ఫిర్యాదుతో రాజ్ భవన్ లోనూ వేడి పుట్టిందని, చివరికి గవర్నర్.. ఇరు వర్గాలకు హితబోధ చేసినట్టు సమాచారం. ఆ వెంటనే ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయం వెలువడింది. కాగా,

పక్కాగా పోలింగ్ ఏర్పాట్లు
ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేపు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తి చేశామని పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెడుతున్నామన్నారు. కోవిడ్ బాధిత ఓటర్ల కోసం చివరి గంటను కేటాయించామని, పాజిటివ్ రోగులకు పీపీఈ కిట్లను అందిస్తున్నామని తెలిపారు. తొలి విడతతో 3,249 గ్రామ పంచాయతీలకు గాను 525 స్థానాలు ఏకగ్రీవంకాగా, 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 2,723 గ్రామ పంచాయతీలకు, 20,157 వార్డు మెంబర్లకు మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుందని ద్వివేది వివరించారు. తొలి విడత పోలింగ్ కోసం 29,732 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వాటిలో 3,594 హైపర్ సెన్సిటివ్, 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామని, ఆ మేరకు భద్రతను కూడా కట్టుదిట్టం చేశామని తెలిపారు.