రాహుల్ తప్పుడు సూత్రీకరణలు…
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు సహా ఇతరత్రా అంశాలపై రాహుల్ వక్ర భాష్యాలు చెప్తున్నారన్న నిర్మలా.. ఆయన్ను డూమ్స్‌డే మ్యాన్‌గా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాలకు,కార్పోరేట్ల కోసం పనిచేస్తోందన్న విమర్శలను ఆమె తప్పు పట్టారు. అసలు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ వైఖరి తీసుకోవాలో కాంగ్రెస్ పార్టీకే స్పష్టత లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ ఇవే తరహా చట్టాలను పొందుపరిచారని… తీరా ఇప్పుడు ఆ చట్టాలపై యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ఎందుకు యూటర్న్ తీసుకుందో లోక్‌సభలో రాహుల్ గాంధీ వివరిస్తారని భావించానని… కానీ అదేమీ జరగలేదని అన్నారు. గతంలో ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణాలు ఇస్తామని ఆశ చూపిందని… కానీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని చేపట్టిన ఆ హామీని అమలుచేయలేదని పేర్కొన్నది.

కాంగ్రెస్‌లా కాదు… స్థిరమైన విధానాలతో ముందుకు…
కాంగ్రెస్ మాదిరి కాకుండా జనసంఘ్ రోజుల నుంచి ఇప్పటివరకూ… దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించే దిశగా స్థిరమైన విధానాలతో తమ పరిపాలన కొనసాగుతోందని సీతారామన్ అభిప్రాయపడ్డారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును కూడా నిర్మలా సీతారామన్ తప్పు పట్టారు. దేశమంతా అమలవుతున్న పీఎం కిసాన్ యోజనా పథకం బెంగాల్లో మాత్రం అమలుకావట్లేదని… దీనిపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని మమతా ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం మొసలి కన్నీరు కార్చితే లాభం లేదని విమర్శించారు. బెంగాల్ ప్రభుత్వమే రైతులకు ఆ పథకం అందకుండా అడ్డుపడుతుందన్నట్లుగా విమర్శించారు.

భారత్‌ను అగ్రశ్రేణిలో నిలబెట్టే సంస్కరణలు : నిర్మలా
మిగతా ప్రపంచంతో పోలిస్తే, భారత్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ ఇచ్చే ప్రేరణతో ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా పునరుజ్జీవం పొందుతుందన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ కేంద్రం సంస్కరణలను పక్కనపెట్టలేదని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకాల ద్వారా దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్దికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇవేమీ కంటి తుడుపు చర్యలు కాదని… ప్రపంచంలోనే భారత్‌ను అగ్రశ్రేణి ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు దోహదపడుతాయని చెప్పారు.