[ad_1]
Mutual Fund SIP: మ్యూచువల్ ఫండ్స్‌లో (MFs) ప్రజల పెట్టుబడులు నెలనెలా పెరుగుతున్నాయి. స్థిరత్వం లేని స్టాక్ మార్కెట్‌తో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్న పెట్టుబడిదార్లు, టెన్షన్ పెట్టని మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలోనూ ఒకేసారి జమ చేయకుండా ‘క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక’ను (Systematic Investment Plan లేదా SIP) ఫాలో అవుతున్నారు. అంటే, నెలవారీ పద్ధతిలో పెట్టుబడి పెడుతూ వెళ్తున్నారు. దీంతో MF SIPs రికార్డ్ సృష్టిస్తున్నాయి.
SIPs ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి చేరిన నిధులు 2022 డిసెంబర్ నెలలో రూ. 13,573.08 కోట్లుగా ఉంటే, 2023 జనవరి నెలలో రూ. 13,856.18 కోట్లకు పెరిగాయని ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా’ (AMFI) తన నెలవారీ నివేదికలో పేర్కొంది. నెలవారీగా ఇది 2.1 శాతం వృద్ధి. అదే సమయంలో, 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు SIPs కాంట్రిబ్యూషన్ 20.3 శాతం పెరిగింది.
AMFI డేటా ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీగా పెరుగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఖాతాల సంఖ్య కూడా పెరుగుతోంది, ప్రస్తుతం, రికార్డ్ స్థాయిలో 14,28,43,642 మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉన్నాయి.
ఈక్విటీ ఫండ్స్‌లో విపరీతమైన ఇన్‌ఫ్లో
2023 జనవరి నెలలోని మొత్తం పెట్టుబడుల్లో… స్మాల్ క్యాప్ & మల్టీ క్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. ఈక్విటీ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 2,256 కోట్లు, లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 1,902 కోట్లు, మల్టీ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 1,773 కోట్లు వచ్చాయి.
మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM), నిర్వహణలోని సగటు ఆస్తులు (AAUM) వరుసగా రూ. 39,62,406 కోట్లుగా, రూ. 40,80,311 కోట్లుగా ఉన్నాయి.
“మ్యూచువల్ ఫండ్ ఫోలియోల్లో మొత్తం వృద్ధి ఊపందుకుంది, జనవరి 2023 డేటాను బట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్లో సానుకూల ధోరణి కనిపించింది. స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌పై వారి నమ్మకాన్ని పెరిగిన SIP నంబర్లు సూచిస్తున్నాయి” అని AMFI చీఫ్ ఎగ్జిక్యూటివ్ N.S. వెంకటేష్ చెప్పారు.
మన మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) వెనక్కు తీసుకుంటున్న పెట్టుబడుల (outflow) గ్యాప్‌ను ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే నిధులు (inflows) బ్యాలెన్స్ చేస్తున్నాయని వెంకటేశ్ వెల్లడించారు.
AMFI నివేదికలోని ముఖ్యాంశాలు:
2023 జనవరిలో రిటైల్ AUMలు (ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్స్) రూ. 20,35,517 కోట్లుగా, AAUM రూ. 20,65,262 కోట్లు లెక్క తేలాయి.
· రిటైల్ స్కీమ్‌ల కింద మొత్తం ఫోలియోల సంఖ్య (ఈక్విటీ, హైబ్రిడ్, సొల్యూషన్-ఓరియెంటెడ్) 11,43,32,946.
· జనవరిలో SIP AUM రూ. 6,73,774.80 కోట్లుగా ఉంది, ఈ నెలలో నమోదైన కొత్త SIPల సంఖ్య 22,65,205.
· జనవరిలో మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు మొత్తం 18 పథకాలను ప్రారంభించాయి. వాటిలో 12 ఓపెన్ ఎండ్ స్కీమ్‌లు, ఆరు క్లోజ్ ఎండ్ స్కీమ్‌లు. వివిధ కేటగిరీల్లో ఇవి రూ. 4,422 కోట్లను సమీకరించాయి.
· జనవరిలో గోల్డ్ ETFs రూ. 21,835.92 కోట్లుగా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link