ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్
అయితే జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా తమ డిమాండ్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ర్యాలీ కంట్రోల్ తప్పింది. ఒక్కసారిగా హింసకు కారణమైంది. ఢిల్లీలో ఎర్రకోట వద్ద పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎర్రకోటపై మతపరమైన జెండాలను ఎగురవేసి ఆందోళనకారులు నానా హంగామా సృష్టించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఎర్రకోట వద్ద రెండు కత్తులు తిప్పుతూ హల్చల్ చేసిన మనీందర్ సింగ్
అందులో భాగంగా మనీందర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మనీందర్ సింగ్ అలియాస్ మోని (30) ఢిల్లీలోని స్వరూప్ నగర్ నివాసి, పితాంపూరాలోని బస్ స్టాప్ సమీపంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు . అతన్ని అరెస్టు చేసిన తరువాత, స్వరూప్ నగర్ లోని మనీందర్ సింగ్ ఇంటి నుండి ఢిల్లీ పోలీసులు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పోలీసు అధికారుల ప్రకారం, నిందితుడు మనీందర్ సింగ్ జనవరి 26 న ఎర్రకోట వద్ద రెండు కత్తులతో హల్చల్ చేశాడు.

ఢిల్లీ హింస కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు దీప్ సిద్ధూతో పాటు ఇక్బాల్ సింగ్ అరెస్ట్
కత్తులను తిప్పుతూ అక్కడ ఉన్న పోలీసులను బెదిరించాడు. దీంతో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి అతను తప్పించుకు తిరుగుతున్నాడు . ఇప్పటికే ఢిల్లీ హింస కేసులో దీప్ సిద్ధూ, ఇక్బాల్ సింగ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు ఎర్ర కోట వద్దకు తీసుకువెళ్లి సీన్ రీ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.