ట్వీట్ వివాదం మరువక ముందే..
ఢిల్లీలో రైతుల ఉద్యమం రిహానా చేసిన ట్వీట్, దానికి భారత విదేశాంగ శాఖ ఖండన, అటుపై రైతుల ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్రపై దర్యాప్తు.. తదితర పరిణామాలతో పాప్ సింగర్ రిహానా పేరు భారత్‌లో మారుమోగిపోయింది. ఆ వివాదం చల్లారక ముందే ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి తీవ్ర దుమారానికి దారి తీసింది. ఇది..

గణేష్ లాకెట్‌తో లోదుస్తుల ప్రమోషన్..
రిహానా తాను ధరించే లోదుస్తుల బ్రాండ్ Savage X Fenty ప్రమోషన్ కోసం తాజాగా టాప్ లెస్ ఫొటో షూట్ చేశారు. అయితే, అర్థనగ్నంగా పోజులిచ్చిన ఫొటోల్లో ఆమె గణేషుడి లాకెట్ ధరించడం వివాదానికి కారణమైంది. చిన్నపాటి షార్ట్ తోపాటు మెడలో గణేషుడి లాకెట్ లో దిగిన ఫొటోలను రిహానా తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ లాకెట్ పై గణేషుడి బొమ్మ కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటం, ఇప్పటికే ఆమె భారత ప్రభుత్వం ఆగ్రహానికి గురైన దరిమిలా నెటిజన్స్ రిహానా తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు..

భారతీయుల మనోభావాలకు దెబ్బ..
అసభ్యకరమైన ఫొటోలకు గణేషుడి బొమ్మను వాడటం ద్వారా రిహానా.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ట్విట్టర్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘‘హిందూవులు ఎంతో భక్తి భావంతో గణేషుడికి పూజలు చేస్తారు. ప్రతి ఏడాది గణేష్ నవరాత్రులు జరుపుకుంటారు. అలాంటి గణేషుడి ప్రతిమను లాక్ట్లా ధరించి.. ఇలాంటి పని చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది మనోభావాలను రిహానా దెబ్బతీసింది” అని కొందరు, ‘‘ఆమె లోదుస్త బ్రాండ్ ప్రమోషన్ కోసం భారతీయుల ఆది దేవుడిని కించపరిచేలా వ్యవహరించం సిగ్గుచేటు”అని ఇంకొందరు విమర్శలు చేశారు. ఇక..

రిహానా అరాచకంపై రాహుల్ స్పందించరేం?
టాప్ లెస్ ఫొటో షూట్ పై బీజేపీ నాయకుడు రామ్ కదమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘మన హిందూ దేవుడు గణేషుడి లాకెట్ ధరించి రిహానా నీచపు పని చేసింది. తద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల, సమస్యలపై రిహానాకు ఎంత చులకన భావం ఉందో తెలుస్తోంది. కనీసం ఇప్పటికైనా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆమె నుంచి సాయం తీసుకోవడం మానేస్తారని ఆశిస్తున్నాను” అంటూ రామ్ కదమ్ మండిపడ్డారు.