బంగారం అమ్ముకున్న 90శాతం ప్రైవేట్ టీచర్లు…
ఆ సర్వే ప్రకారం… హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 90శాతం మంది మహిళా టీచర్లు లాక్ డౌన్ కాలంలో ఇల్లు గడవడం కోసం తమ బంగారు ఆభరణాలను అమ్మేసుకున్నారు. 83శాతం మంది టీచర్లు లాక్ డౌన్ పీరియడ్‌లో ఐదు నెలల అద్దె చెల్లించేందుకు బంగారాన్ని తాకట్టు పెట్టారు. కొంతమంది ప్రైవేట్ టీచర్లు తమ వెహికల్స్‌ను కూడా అమ్మేశారు. అయినప్పటికీ చెల్లించాల్సిన బిల్లులు,అవసరాలు ఇంకా తీరకపోవడంతో చాలామంది అప్పులు కూడా చేశారు.

తప్పని అప్పులు…
దాదాపు 90శాతం మంది ప్రైవేట్ టీచర్లు లాక్ డౌన్ పీరియడ్‌లో బంధువుల నుంచి రూ.30వేల పైచిలుకు అప్పులు చేశారు. ‘లాక్ డౌన్లో నేను నా భార్య గోల్డ్ చైన్ తాకట్టు పెట్టి రూ.40వేలు అప్పు తీసుకొచ్చాను.’ అని సర్వేలో పాల్గొన్న జి.చంద్రశేఖర్ రావు అనే ప్రైవేట్ టీచర్ వెల్లడించాడు. గత 20 ఏళ్లుగా తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న తనను లాక్ డౌన్ పీరియడ్‌లో యాజమాన్యం పట్టించుకోలేదని… ఏప్రిల్,2020 నుంచి తనకు వేతనం లేదని వాపోయాడు.

ప్రైవేట్ టీచర్ల కష్టాలు వర్ణణాతీతం…
రాము నాయక్ అనే మరో ప్రైవేట్ టీచర్… లాక్ డౌన్ పీరియడ్‌లో ఖర్చుల కోసం తన బైక్‌ని అమ్మినట్లు చెప్పాడు. పని లేకపోవడంతో తిరిగి స్వగ్రామం వచ్చేశానని… కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు.భారత్ దేఖో సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 220 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు.. లాక్ డౌన్ పీరియడ్‌లో తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి వెల్లడించారు.
ఇటీవలే ఓ ప్రైవేట్ లెక్చరర్ హైదరాబాద్‌లోని చైతన్యపురి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తన భార్యా,పిల్లలకు కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నానని.. చావడం తప్ప మరో దిక్కు లేక ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు ఆయన వాపోయారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. అటు యాజమాన్యాలు,ఇటు ప్రభుత్వం ఎవరూ ప్రైవేట్ టీచర్లను పట్టించుకోకపోవడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.