ఎన్నికలు ముగియగానే ఏపీ అసెంబ్లీ భేటీ
ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు రేపటితో ముగియనుంది. ఆ తర్వాత మార్చి 2 నుంచి మన్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికలు, మార్చి 14న కౌంటింగ్ ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిని క్రోడీకరించే పనిలో బీజీగా ఉంది. ఓవైపు ఎన్నికలు ఎదుర్కొంటూనే మరోవైపు బడ్జెట్ అంచనాలను సిద్ధం చేస్తోంది.

23న కేబినెట్ భేటీలో అజెండా ఖరారు
ఈ నెల 23న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చ జరుగబోతోంది. ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోలేకపోయినా, కీలక అంశాలపై చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఏపీ అసెంబ్లీ సమావేశాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయాల్సిన తీర్మానం, చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అజెండా అంశాలను కూడా ఖరారు చేయనున్నారు.

బడ్జెట్, స్టీల్ ప్లాంట్ తీర్మానాలే అజెండా
వచ్చేనెల మూడో వారంలో నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బడ్జెట్‌తో పాటు ఇతర అంశాలకూ చోటు కల్పించనున్నారు. వీటిలో ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం. బడ్డెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టీల్ ప్లాంట్‌పై తీర్మానంతో పాటు ఇతర అంశాలకూ అసెంబ్లీ సమావేశాల అజెండాతో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు కీలక అంశాలపై జరిగే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.