వైసీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు
వాపును చూసి బలుపు అనుకుంటే మునిగిపోయేది వైసిపినే అంటూ కూన రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసిపి నేతలు కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని పేర్కొన్న కూన రవికుమార్, వైసీపీ చెప్పుకుంటున్నన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో లేవని, రెబెల్స్ గా గెలిచిన వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని, అదే విజయమని భ్రమపడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రెండు శాతం పంచాయతీలకు అసలు ఎన్నికలే జరగని లేదని, కానీ 98 శాతం గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటం హాస్యాస్పదం అంటూ, బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్.

బొత్సాది అజ్ఞానమో, అహంకారమో అర్ధం కావటం లేదు
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అహంకారంతో మాట్లాడుతున్నారో , అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇక విజయసాయి రెడ్డి మాటలు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గెలుపోటములు సహజం అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు కూన రవికుమార్.
రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడితే ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కూన రవికుమార్ .

పెద్దకోట బ్యాలెట్ పేపర్స్ వ్యవహారంపై తక్షణ విచారణకు డిమాండ్
ఎల్ ఎన్ పేట మండలం పెద్దకోట బ్యాలెట్ పేపర్స్ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. అధికారులు సహకారంతోనే తప్పులు జరిగాయని, జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.
మూడు విడతల్లో మాదే విజయం అని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ టీడీపీ విజయం సాధించి తీరుతుంది అని కూన రవి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.