జీవితంలో ఒకసారైనా..
వ్యక్తిగత రుణాల గురించి సరళ్ క్రెడిట్ అనే ఫిన్ టెక్ కంపెనీ ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 2021తో పోలిస్తే 2022లో పర్సనల్ లోన్స్ విభాగంలో 46 శాతం వృద్ధి నమోదైనట్లు తేలింది. దేశంలోని 67 శాతం మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి జీవితంలో ఏదో ఒకసారి వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు చెప్పారు. 36 శాతం మంది ఇల్లు కొనుగోలు లేదా మరమ్మతులు, 9 శాతం మంది వెకేషన్ గడపడం కోసం పర్సనల్ లోన్ పొందినట్లు వెల్లడించారు.

ఎవరి నుంచి లోన్ తీసుకోవాలి?
రుణదాతని ఎంచుకోవడంలో భారతీయులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సర్వే తెలిపింది. వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకునే వారిలో 63 శాతం మంది వడ్డీ రేటును కీలకంగా భావిస్తామని వెల్లడించారు. అందులో 77 శాతం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. 14 శాతం మంది మాత్రం నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలే(NBFC) బెటర్ అని అభిప్రాయపడ్డారు.

మార్కెట్ లో మంచి వృద్ధి:
“భారత్ లో పర్సనల్ లోన్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనబరుస్తోంది. రుణగ్రహీతల ఇష్టాలను, అవసరాలను లోతుగా తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడింది. వ్యక్తిగత రుణాలు ఎందుకు తీసుకుంటారు, అప్పులు పొందే ముందు పరిగణించే అంశాలు ఏంటి, ఎవరి నుంచి రుణం తీసుకోవడానికి ఇష్టపడతారు వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగాం” అని సరళ్ క్రెడిట్ డైరైక్టర్ మిలింద్ సాత్పుటే తెలిపారు.

మధ్యతరగతివారే ఎక్కువ:
రుణ యోగ్యత ప్రాముఖ్యత పెరుగుతున్నట్లు సర్వే స్ఫష్టం చేసింది. క్రెడిట్ స్కోరు తెలుసుకోవడానికి ప్రజలు ఎప్పటికప్పుడు నివేదికను సమీక్షిస్తున్నట్లు తేలింది. ఇందులో పాల్గొన్న వారిలో 91 శాతం గ్రాడ్యుయేట్లు కాగా, 70 శాతం మంది రూ.30 వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. పైగా అధిక భాగం మధ్య తరగతికి చెందిన వారు. పురుషులతో పాటు మహిళలు సైతం సర్వేలో పాల్గొనడం వారి ఆర్థిక స్వాతంత్య్రానికి సంకేతమని నిర్వాహకులు భావిస్తున్నారు.