వాలంటీర్ లపై దాదాపు 600ఫిర్యాదులు వచ్చాయని కోర్టుకు చెప్పిన ఎస్ఈసీ తరపు న్యాయవాది
వాలంటీర్లు నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని, దాదాపు వారిపై 600 ఫిర్యాదుల మేరకు అందాయని హైకోర్టు ధర్మాసనానికి ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వివరించారు. లబ్ధిదారులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వాలంటీర్లను స్థానిక నేతలు ప్రభావితం చేస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుంటూ తమ పార్టీ కోసం ప్రచారం చేయించుకుంటున్నారని పేర్కొన్నారు.

వాలంటీర్ల పై నిర్ణయం తీసుకోవటానికి కారణాలు ధర్మాసనం దృష్టికి
ఓటర్ స్లిప్పుల పంపిణీలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని, అధికార పార్టీ అనుచరులకు స్లిప్పులు ఇచ్చి, ప్రత్యర్థి వర్గాలకు స్లిప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు అందిన మేరకు వాలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల ప్రక్రియలో నివారించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ల మీద వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు కోర్టుకు వివరించారు .

ప్రభుత్వ వాదన ఇలా … వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఇక ప్రభుత్వం వాలంటీర్లు పెన్షన్ ల అందజేత, ప్రభుత్వ పథకాల అమలులో పాల్గొనకపోతే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది . వార్డు వాలంటీర్లు వద్దనున్న ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలపై కూడా ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉందా అన్న ప్రశ్నకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది పెన్షన్ల పంపిణీకి తమకు ఇబ్బంది ఏమీ లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.