విశాఖపట్నం: పెదగంట్యాడ-గంగవరం మార్గంలో ఉద్రిక్తత నెలకొంది. లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికు ఆందోళనకు దిగారు. లారీని తగలబెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్య్సకార గ్రామానికి చెందిన పేర్ల పెంటయ్య(42) విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం రాత్రి విధులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. పెంటయ్యను పెదగంట్యాడ నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ మార్గంలో భారీ వాహనాలు తిరగకూడదని చెప్పినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా, ఈ క్రమంలోనే పలువురు లారీకి నిప్పుపెట్టారు. మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.