National
oi-Chandrasekhar Rao
కోల్‌కత: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. రాజధాని కోల్‌కత సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థిితి నెలకొంది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జకీర్ హుస్సేన్‌పై క్రూడ్బాంబు దాడి తరువాత.. కోల్‌కత దాడులతో అట్టుడికిపోయింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శిబాజీ సింగ రాయ్ గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.
కోల్‌కత ఫూల్ బగాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నిర్వహించ దలిచిన ఓ సమావేశానికి హాజరు కావడానికి మాజీమంత్రి సువేందు అధికారి, శంకుదేబ్ పండా, శిబాజీ సింగ రాయ్ కోల్‌కతకు వచ్చారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి ఫూల్ బగాన్ మీదుగా ర్యాలీగా బయలుదేరి వెళ్తోన్న సమయంలో తృణమూల్ కార్యకర్తలు దాడులకు దిగారు.
#WATCH I West Bengal: BJP District President North Kolkata Shibaji Singha Roy was injured after he along with party leaders including Suvendu Adhikari and Shankudeb Panda was attacked allegedly by some persons at Phool Bagan.
He has been admitted to a hospital. pic.twitter.com/ZUs2jDIEKJ
— ANI (@ANI) February 17, 2021
కార్మికమంత్రి జకీర్ హుస్సేన్‌పై దాడి ఘటన చోటు చేసుకున్న సమాచారం అప్పటికే వారికి తెలియడంతో సువేందు అధికారి ర్యాలీపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. పరస్పర దాడులతో ఫూల్ బగాన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లోగాయపడిన శిబాజీ సింగ రాయ్‌ను ఆసుపత్రికి తరలించారు. అధికార పార్టీ అగ్ర నాయకులే ఈ దాడిని చేయించారంటూ బలూర్ఘాట్ బీజేపీ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ సుకాంత మజుందార్ ఆరోపించారు. తృణమూల్ జులం ఇంకొన్ని రోజులు మాత్రమేనని, అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం తమ చేతుల్లోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని విమర్శించారు.