అన్ షెడ్యూల్డ్..
ఈ తెల్లవారు జామున ఆయన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. నేరుగా వ్యాక్సినేషన్ విభాగానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మెడలో.. అస్సామీ సంస్కృతిని ప్రతిబింబించే కండువా కనిపించింది. నిజానికి- మోడీ వ్యాక్సిన్ వేయించుకునేది ఆయన షెడ్యూల్ చేయలేదు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్న గంట ముందు మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారులు ఎయిమ్స్ డాక్టర్లకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్‌కు వెళ్లిన తరువాత.. అక్కడి డాక్టర్లు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు.
పుదుచ్చేరి నర్స్ చేతుల మీదుగా..
వ్యాక్సినేషనల్ విభాగంలో టీకా ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ప్రధానికి ఇంజెక్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన నర్సు సిస్టర్ పీ నివేదా ప్రధానికి వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ తీసుకున్న అనంతరం మోడీ అక్కడే కొద్దిసేపు గడిపారు. వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి.. ఎయిమ్స్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై అక్కడి డాక్టర్లతో ముచ్చటించారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఒకరిద్దరు డాక్టర్లు తప్ప మరెవరూ లేరు. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం.. తన వివరాలను ఆయనే స్వయంగా రాసిచ్చారు.

భయాందోళనలు వద్దు..
కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయాందోళనలు వద్దని ప్రధాని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం యావత్తూ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి చేస్తోన్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇవ్వాళ్లి నుంచే 60 ఏళ్లకు పైబడిన వయస్సున్న సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే- వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న 45 సంవత్సాలకు పైనున్న వయస్సున్న వారు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.