కరోనా కారణంగా విధించిన వేతనకోత… కుటుంబ పోషణ కష్టంగా ఉందని కండక్టర్ ఆవేదన
కర్ణాటక రవాణా శాఖకు చెందిన 38 ఏళ్ల హనుమంతు పాలేగర్ బస్సు కండక్టర్ గా పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం దెబ్బకు విలవిలలాడిపోతున్నాడు . కరోనా కారణంగా వేతనంలో కోత విధించడంతో అతని జీవనం దుర్భరంగా మారింది . సరుకులు కొనలేని ,ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన పిల్లల చదువు, తల్లిదండ్రుల వైద్య చికిత్సలకు కావాల్సిన ఆర్థిక వనరులు తన దగ్గర లేవని ప్రస్తుతం వస్తున్న సొమ్ముతో రోజువారీ అవసరాలు కూడా తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్ధిక అవసరాల కోసం కిడ్నీ అమ్మకానికి పెట్టిన కర్ణాటక రవాణా శాఖ కండక్టర్
ఈశాన్య కర్ణాటక ఆర్టీసీకి చెందిన గంగావతి డిపో లో పనిచేస్తున్న హనుమంత కాలేగర్ తన ఆర్థిక అవసరాల కోసం కిడ్నీ అమ్ముకునేందుకు రెడీ అయినట్లుగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. అందులో తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ తో, ప్రస్తుతం నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తో పనిచేస్తున్న తన జీవితంలో ఏ విధమైన మార్పు రాలేదని, ఆర్థిక స్థితి మెరుగు పడలేదని కండక్టర్ హనుమంతు కాలేగర్ అంటున్నారు.

కండక్టర్ పోస్ట్ పై స్పందించిన రవాణా శాఖ ..సరిగా విధులకు హాజరు కాడని వివరణ
కరోనా మహమ్మారి తన ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆయన చెప్తున్నారు. అయితే నార్త్ ఈస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ యొక్క కొప్పల్ డివిజనల్ కంట్రోలర్ ఎంఏ ముల్లా మాట్లాడుతూ కండక్టర్ తన విధి నిర్వహణలో సక్రమంగా లేరని విధులకు సరిగా హాజరు కాడని, అందుకే వేతనం పూర్తిస్థాయిలో రావడం లేదని చెప్పారు. అతను రోజూ విధులకు వచ్చేలా చూడాలని ,అలా అయితే సమస్యలు పరిష్కారమవుతాయని కాలేగర్ కుటుంబసభ్యులకు కూడా చెప్పినట్లు ముల్లా తెలిపారు. సక్రమంగా విధులకు హాజరు కాని కారణంగానే ప్రస్తుతం అతని టేక్ హోం పే తక్కువగా ఉందని అంటున్నారు.