తొలగింపుపై న్యాయస్థానంలో పోరు
సీనియర్ ఐఎఎస్ అధికారి రామ్ ప్రకాష్ సిసోడియా విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అవినీతి, కుట్రపూరక, దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జగన్ సర్కార్ ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లోనూ పిటీషన్ దాఖలు చేశారు.

స్టేట్మెంట్ రికార్డ్..
ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. వాటిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని, ఏబీ వెంకటేశ్వర రావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, ఓ నివేదికను అందజేయాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఆర్పీ సిసోడియా సారథ్యంలో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. రెండు వారాలుగా ఈ కమిషన్ విచారణ కొనసాగిస్తూ వచ్చింది. ఆదివారం నాటితో అది ముగిసింది. విచారణ చివరిరోజు ఏబీ వెంకటేశ్వర రావు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తన స్టేట్మెంట్లో ఏబీ.. పలు కీలక అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.

వైఎస్ వివేకా హత్యతో
మాజీమంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన తన స్టేట్మెంట్లో పొందుపరిచినట్లు సమాచారం. విచారణ కమిషన్ ఎదుట హాజరైన అనంతరం వెంకటేశ్వర రావు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ వివేకా మరణం ప్రమాదశావత్తూ చోటు చేసుకుందనడంలో ఎంత నిజముందో.. తనపై వచ్చిన ఆరోపణల్లోనూ అంతే వాస్తవముందని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా మృదు స్వభావి అని, ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఏబీ అన్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించిందని అన్నారు. ఉద్దేశపూరకంగా ఆరోపణలు చేశారనేది దీనితో స్పష్టమౌతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

నిజాలు బయటికొస్తాయ్..
తన కుమారుడు నెలకొల్పిన సంస్థకు ఎలాంటి నిఘా పరికరాల లావాదేవీలతో సంబంధాలు లేవని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కాంట్రాక్టు, వ్యాపారంతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను రాతపూరకంగా విచారణ కమిషన్‌కు సమర్పించానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా కృత్రిమ డాక్యుమెంట్లు, ఫోర్జరీ మెయిల్స్ సృష్టించారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అఖిల భారత సర్వీసుల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తన హయాంలో చోటు చేసుకున్న లావాదేవీలన్నీ పారదర్శకంగా, చట్టప్రకారంగా సాగినవేనని పేర్కొన్నారు.