వేడెక్కుతున్న వైజాగ్ స్టీల్ ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం సాగర నగరంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్మికసంఘాలు పెంచుతున్న ఒత్తిడి రాజకీయ పార్టీలకు గట్టిగానే తాకుతోంది. దీంతో గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ దూరం కాకుండా ఉండేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి రాజకీయ నేతలకు ఎదురవుతోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముంది.
అదే సమయంలో రాజకీయ పార్టీల వ్యవహారశైలి కూడా ఈ ఉద్యమానికి ఆజ్యం పోస్తోంది.

గంటా కేంద్రంగా మారిపోతున్న ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కార్మికులు మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పుడు టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేంద్రంగా మారిపోతోంది. స్టీల్ ప్లాంట్ కోసం అందరి కంటే ముందే రాజీనామా సమర్పించిన గంటా శ్రీనివాస్ ఇప్పుడు అక్కడి కార్మికసంఘాలకు, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగాలని వారు కూడా కోరుకుంటున్న పరిస్ధితి. అయితే ఇది గంటా సొంత పార్టీ టీడీపీతో పాటు అధికార వైసీపీకి కూడా చుక్కలు చూపిస్తోంది. అటు గంటాకు నేరుగా మద్దతివ్వలేక, అలాగని వ్యతిరేకించలేక టీడీపీ, వైసీపీ మధనపడుతున్నాయి.

కాక రేపుతున్న గంటా రాజీనామా సవాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం ఉద్యమంలో తొలి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ వైసీపీకి పెను సవాల్ విసిరారు. తొలుత స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించలేదనే విమర్శలు రావడంతో మరోసారి ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాసిన గంటాపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక వైసీపీ మధన పడుతోంది. గంటా రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది వైసీపీకి పెద్ద సవాలుగా మారింది. ఈ రాజీనామా ఆమోదిస్తే విశాఖలో తమ పార్టీ నేతల రాజీనామాల డిమాండ్లు పెరుగుతాయి. అలాగని మౌనంగా ఉన్నా రాజీనామాల ఒత్తిడి పెరుగుతూనే ఉంది. దీంతో గంటా రాజీనామా సవాల్ వైసీపీకి తలనొప్పిగా మారింది.

నాన్ పొలిటికల్ జేఏసీ వ్యూహమిదేనా ?
తాను ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయాలన్న గంటా శ్రీనివాస్ నిర్ణయం సైతం కలకం రేపుతోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల సాయం లేకుండా ఇలాంటి జేఏసీలు నడపడం కూడా సాధ్యం కాదు. అధికారంలో ఉన్న పార్టీలు సహజంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ ఇలాంటి వ్యూహాలు రచించేది. కానీ ఇప్పుడు విపక్షంలో ఉంటూ గంటా చేస్తున్న ఈ ప్రయత్నం వైసీపీకి అనుకూలమా, ప్రతికూలమా అన్నది తేలాల్సి ఉంది. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారనేది స్పష్టం కాకపోయినా ఇప్పటికే గంటా శ్రీనివాస్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితో సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని బట్టి చూస్తుంటే ఏదో భారీ స్కెచ్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీని టార్గెట్ చేయడంతో పాటు తన సత్తా చూపడమే లక్ష్యంగా గంటా ఈ ప్రయత్నం చే్స్తున్నట్లు సమాచారం.